Begin typing your search above and press return to search.

ఢిల్లీలో తగ్గని వాయుకాలుష్యం ... విద్యాసంస్థలు మూసివేత

By:  Tupaki Desk   |   17 Nov 2021 10:30 AM GMT
ఢిల్లీలో తగ్గని వాయుకాలుష్యం ... విద్యాసంస్థలు మూసివేత
X
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థితి అలాగే కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడి కాలుష్యంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు కూడా కల్పించుకోవాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితుల్లో ఏమాత్రం మెరుగుదల కనిపించకపోవడంతో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీతోపాటు సమీపంలోని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాలు జారీ చేసింది.

దీపావళి ముందు వరకు రాజధానిలో సాధారణంగానే ఉన్న వాతావరణం ఆ తర్వాతి రోజు నుంచి ఒక్కసారిగా మారిపోయి, నగరం నిండా కాలుష్యం కమ్ముకుంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోయారు. పరిస్థితుల్లో ఇప్పటికీ ఎటువంటి మార్పు లేకపోవడంతో ప్రభుత్వం తాజాగా స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఆన్‌ లైన్‌ లో బోధనలు కొనసాగించాలని ఆదేశించింది.

అలాగే, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీ రాష్ట్రాల్లోని ఆయా కంపెనీలన్నీ ఈ నెల 21 వరకు 50 శాతం ఉద్యోగులతోనే కార్యకలాపాలు నిర్వహించాలని, మిగతా 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాలని సీఏక్యూఎం ఆదేశించింది. రాజధాని ప్రాంతంలోని ప్రైవేటు సంస్థలు కూడా 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇవ్వాలని కోరింది.

గాలి నాణ్యత సూచీ 0-50 మధ్యలో ఉంటే.. గాలి మంచిదిగా పరిగణిస్తారు. 51-100 మధ్యలో ఉంటే సంతృప్తికరమైనదిగా, 101-200 మధ్యలో ఉంటే ఒక మాదిరి పర్లేదు అన్నట్టుగా భావిస్తారు. ఇక 201-300 మధ్యలో ఉంటే అతి చెడుగాలిగా, 301-400 మధ్యలో ఉంటే అత్యంత చెడు గాలిగా,401 దాటితే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు.

ఇదిలా ఉండగా, గాలివేగం పెరుగుతున్నందున మంగళవారం సైతం గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం లేదని సఫర్‌ అంచనా వేసింది. ఉదయం పొగమంచు పేరుకుపోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వాయు కాలుష్యానికి ప్రధాన దోషులు రవాణా, పరిశ్రమలు, వాహనాల రాకపోకలే కాకుండా కొన్ని ప్రాంతాలలో చెత్తను కాల్చడం ప్రధాన కారణాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.పంట వ్యర్థాలు వల్ల కేవలం 10 శాతం మాత్రమే కాలుష్యానికి కారణమవుతుందని అభిప్రాయపడింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి నిర్మాణాన్ని నిలిపివేయడం, అనవసరమైన రవాణా, పవర్ ప్లాంట్లను ఆపేయడంతో పాటు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయడం వంటి అంశాలపై మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆదేశించింది.