Begin typing your search above and press return to search.

ఢిల్లీ వాసులకి దీపావళి కష్టాలు...!

By:  Tupaki Desk   |   28 Oct 2019 6:56 AM GMT
ఢిల్లీ వాసులకి దీపావళి కష్టాలు...!
X
దీపావళి పండుగ అందరికి కొత్త వెలుగుల్ని తీసుకు వస్తే ... ఢిల్లీ నగర వాసులకి దీపావళి కొత్త సమస్యలని తీసుకువచ్చింది. ఇప్పటికే ఢిల్లీ కాలుష్యం పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఇక దీపావళి పండుగ కావడంతో నగరాన్ని కాలుష్యం మరింత కమ్మేసింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. దేశ రాజధానిలో సోమవారానికి పవన నాణ్యత సూచీ ఉదయం 9 గంటలకు 463గా ఉండటంతో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా.. సుప్రీంకోర్టు 2018లోనే వాతావరణానికి హాని కలిగించే టపాలసులను కాల్చరాదని - కేవలం ఎకో ఫ్రెండ్లీ టపాసులను మాత్రమే కాల్చాలని తెలిపింది. ఈ క్రమంలో సుప్రీం ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం బహిరంగా టపాసుల అమ్మకాలను నిషేధించగా కాకరవొత్తులు - చిచ్చుబుడ్లను మాత్రమే కాల్చుకోవడానికి అనుమతినిచ్చింది. ఇవి కూడా కేవలం ప్రభుత్వం తయారు చేసినవి మాత్రమే కొనాలని సూచించింది. అలాగే కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 వరకు మాత్రమే బాణాసంచా పేల్చాలని ఆంక్షలు విధించింది. అంతేగాక శనివారం నుంచి రాత్రి సమయాల్లో భవన నిర్మాణ పనులను నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ , ఢిల్లీ లో నమోదైన కాలుష్య తీవ్రతని బట్టి చూస్తే ఎవరు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించినట్టు లేరు అని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సరి-బేసి విధానాన్ని నవంబర్‌ 4 నుంచి 15 వరకు మరోసారి అమలు చేయనున్నారు. సాధారణంగా పవన నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే మంచిదని - 51-100 ఫర్వాలేదని - 101-200 మధ్య రకమని - 201-300 బాలేదని - 301-400 పూర్తిగా బాలేదని - అలాగే 401-500 తీవ్రమైనది - ప్రమాదకరమని సఫర్‌ తెలిపింది. దీనితో ప్రస్తుతం ఢిల్లీ లో కాలుష్యం ప్రమాద స్థాయిలో ఉంది. దీనితో ఎవరైనా అత్యవసరం అయితే తప్ప ..కొన్ని రోజుల వరకు ఢిల్లీకి వెళ్ళకపోవడం మంచింది.