Begin typing your search above and press return to search.

దీపావళి ఎఫెక్ట్..హైదరాబాద్ మరో ఢిల్లీ కాబోతుందా?

By:  Tupaki Desk   |   30 Oct 2019 8:07 AM GMT
దీపావళి ఎఫెక్ట్..హైదరాబాద్ మరో ఢిల్లీ కాబోతుందా?
X
దీపావళి పండుగ ఎఫెక్ట్ హైదరాబాద్ నగరవాసులపై భారీగా ప్రభావం చూపేలా కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో కాలుష్యం ఎక్కువైంది అని పీసీబీ చెప్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో దీపావళి పండుగ రావడంతో నగరంలో వాయు కాలుష్యం గరిష్ట స్థాయిని దాటేసింది ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం తార స్థాయికి చేరింది. ఇక హైదరాబాద్ నగరవాసులు సరైన నియమాలు పాటించకపోతే త్వరలోనే ఢిల్లీ పక్కన చోటు ఖాయంగా కనిపిస్తుంది.

పండుగ తరువాత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నగరంలో గాలి నాణ్యతపై నివేదిక విడుదల చేసింది.గతేడాది కంటే ఈ ఏడాది కాలుష్య తీవ్రత మరింత పెరిగింది అని తెలిపింది. గత ఏడాది కాలుష్యం 622 మైక్రో గ్రాములుగా ఉండగా, ఈ ఏడాది అది 830 మైక్రో గ్రాములకు చేరిందని తెలిపింది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం అయిన సనత్ నగర్ లో అత్యధిక కాలుష్యం నమోదైందని తెలిపింది.

కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర పీసీబీ గాలి నాణ్యతను పరిశీలిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే దీపావళి ముందు రోజు శనివారం ఏక్యూఐ 65 నుంచి 80 మధ్య ఉండగా - అది అదివారం సాయంత్రం నాటికి 240కు చేరింది. సనత్ నగర్ లో పండగరోజు సాయంత్రం నాటికి గరిష్టంగా 720 మైక్రో గ్రాములకు చేరింది. గాలిలో ఏక్యూఐ 300 దాటితే ప్రమాదకరం కానీ , మనం ఇప్పటికే గరిష్ట స్థాయిని దాటి రెట్టింపు స్థాయిలో ఉన్నాం. దీనిపై పీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇకనైనా కూడా నగర వాసుల్లో మార్పు రాకపోతే ఢిల్లీ ప్రజలు పడుతున్న కష్టాలు అతి త్వరలో హైదరాబాద్ లో కూడా ప్రారంభం కావచ్చు..