Begin typing your search above and press return to search.

ఇక హిందూ మ‌హాస‌ముద్రంలో చైనాకు ద‌బిడ‌దిబిడేనా?

By:  Tupaki Desk   |   2 Sep 2022 3:30 PM GMT
ఇక హిందూ మ‌హాస‌ముద్రంలో చైనాకు ద‌బిడ‌దిబిడేనా?
X
ప‌దుల సంఖ్య‌లో యుద్ధ విమానాల‌ను, హెలికాప్ట‌ర్ల‌ను మోసుకుపోగ‌ల యుద్ధ విమాన వాహ‌క నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను భార‌త్ సముద్ర జ‌లాల్లోకి ప్ర‌వేశ‌పెట్టింది. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో నిర్మించిన తొలి యుద్ధ విమాన వాహ‌క నౌక‌గా ఐఎన్ఎస్ విక్రాంత్ రికార్డు సృష్టించింది. దీన్ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ కేర‌ళ‌లోని కొచ్చిలో స‌ముద్ర జ‌లాల్లోకి ప్ర‌వేశ‌పెట్టారు. ఈ నౌక నిర్మాణానికి సుమారు రూ.20,000 కోట్లు ఖ‌ర్చు చేశారు. నౌక నిర్మాణానికి 13 ఏళ్లు ప‌ట్టింది. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో యుద్ధ విమాన వాహ‌క నౌక‌ల‌ను తయారు చేయ‌గ‌ల ఐదో దేశంగా భార‌త్ రికార్డు సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సామ‌ర్థ్యం అమెరికా, ర‌ష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ల‌కు మాత్ర‌మే ఉండ‌గా భార‌త్ వాటి స‌ర‌స‌న ఐదో దేశంగా చేరింది.

ఐఎన్ఎస్ విక్రాంత్‌తో క‌లిపి భార‌త్ వ‌ద్ద రెండు యుద్ధ విమాన వాహ‌క నౌక‌లు ఉన్నాయి. హిందూ మ‌హా స‌ముద్రంలో అమేయ శ‌క్తిగా మారుతూ భార‌త్‌కు చికాకులు సృష్టిస్తున్న చైనాకు ఈ యుద్ధ విమాన వాహ‌క నౌక‌తో చెక్ పెట్టొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

కాగా ఐఎన్ఎస్ విక్రాంత్ లో అత్యధిక శాతం దేశీయంగా తయారైన పరికరాలనే వినియోగించారు. ఇందుకోసం పలు భారీ పరిశ్రమలు,100 ఎంఎస్‌ఎంఈలు శ్రమించాయి.ఈ నౌక నిర్మాణాన్ని కొచ్చిన్‌ షిప్‌ యార్డ్ లో పూర్తి చేశారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో 43,000 టన్నుల బరువు ఉంది. ఇది గంటకు 28 నాట్స్ (గంట‌కు 52 కి.మీ) వేగంతో ఏకధాటిగా 7,500 నాటికల్‌ మైళ్లు ప్రయాణించగలద‌ని చెబుతున్నారు. ఈ నౌకలో 14 అంత‌స్తులు ఉన్నాయి. మొత్తం 2,200 కంపార్టుమెంట్లు నిర్మించారు. ఇక్కడ 1,750 మంది సిబ్బంది సౌకర్యవంతంగా ఉండొచ్చు. మహిళా ఆఫీసర్లకు రెండు ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి. అలాగే నౌక‌లో ప్ర‌త్యేకంగా ఆస్ప‌త్రి ఉంది. ఐసీయూ సౌక‌ర్యం కూడా ఉంది.

ఐఎన్ఎస్ విక్రాంత్ పై ఒకేసారి 30 యుద్ధ విమానాల‌ను, ఆరు హెలికాప్ట‌ర్ల‌ను, 12 జెట్ల‌ను తీసుకెళ్లొచ్చు. అలాగే మిగ్‌-29కే ఫైటర్‌ జెట్‌లు, కమావ్‌-31, హెచ్‌ఆర్‌-60 ఆర్‌ హెలికాప్టర్లు దీనిపై అందుబాటులో ఉంటాయి. ఇక నౌక ఫ్లైట్ డెక్ 12,500 చ‌.మీ. ఉంటుంది. ఇది రెండున్న‌ర హాకీ ఫీల్డులతో స‌మానమ‌ని చెబుతున్నారు. ఈ నౌక నిర్మాణంలో 15 వేల సిబ్బంది, ఉద్యోగులు పాలుపంచుకున్నారు.

రక్షణపరంగా, రవాణాపరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మనకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుంద‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏ దేశానికైనా యుద్ధ విమానాలను మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగిన నౌకలు ఉంటే నావికాశక్తి పటిష్టంగా ఉంటుంద‌ని అంటున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ తో సముద్ర జలాల్లోనూ, గగన తలంపై కూడా పట్టు సాధించగల‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సొంతమ‌ని పేర్కొంటున్నారు.

శ‌త్రు దేశం చైనా దగ్గర రెండు విమాన వాహక నౌకలు, 355 యుద్ధ నౌకలు, 48 విధ్వంసక నౌకలు, 43 ఫ్రిజెట్లు, 61 కార్వెట్లున్నాయ‌ని స‌మాచారం. మూడో విమాన వాహక నౌక తయారీని చైనా మొద‌లుపెట్టింద‌ని తెలుస్తోంది.

మనకు మాత్రం ఇప్పటిదాకా విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య మాత్రమే ఉంది. 10 విధ్వంసక నౌకలు, 12 ఫ్రిజెట్లు, 20 కార్వెట్లున్నాయి. ఇప్పుడు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ రాకతో బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ముఖ్యంగా హిందూ మ‌హా స‌ముద్రం జలాలపై మన పట్టు మరింత బిగుస్తుంద‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.