Begin typing your search above and press return to search.

జూన్ నాటికి కొత్త యాజమాన్యం చేతుల్లోకి ఎయిరిండియా!

By:  Tupaki Desk   |   27 March 2021 7:15 AM GMT
జూన్ నాటికి కొత్త యాజమాన్యం చేతుల్లోకి ఎయిరిండియా!
X
రాబోయే 64 రోజుల్లోనే ప్రభుత్వ విమానయానరంగ సంస్థ ఎయిరిండియాకు నూతన యాజమాన్యం ఖరారవుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. వచ్చే మే నెల ఆఖరుకు ఎయిరిండియా భవిష్యత్తు యజమానిని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తద్వారా పౌర విమానయాన రంగంలో అతిపెద్ద సంస్కరణ కానుంది. ఓ ఎకనమిక్ కాంక్లేవ్ ‌లో ఆయన మాట్లాడారు. ఎయిరిండియాకు జూన్ నాటికి కొత్త యాజమాన్యం వస్తుందనే అంచనాలు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక బిడ్స్‌ను త్వరలో ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియాను ప్రయివేటీకరించాలని లేదంటే అమ్మివేయాలన్నారు. ఇంతకుమించి మరో మార్గం లేదన్నారు.

బిడ్స్ ప్రక్రియ పూర్తిచేసేందుకు 64 రోజుల సమయం పడుతుందన్నారు. ఇదంతా మే చివరి నాటికి పూర్తి కావొచ్చునన్నారు. ఆ తర్వాత ఎయిరిండియాను ఎవరికి అప్పగించాలనేది తెలుస్తుందన్నారు. ఎయిరిండియాకు రోజూ రూ.20 కోట్ల చొప్పున నష్టం వస్తోందని, నిర్వహణ వైఫల్యాల కారణంగా ఎయిరిండియా మొత్తం రుణాలు రూ.60,000 కోట్లకు చేరాయన్నారు. సంస్థ కోసం ప్రతిసారీ ఆర్థిక మంత్రి వద్దకు వెళ్లి డబ్బులు అడగలేకపోతున్నట్లు తెలిపారు.

కాగా, ఎయిరిండియా కోసం ఆల్ ఖైమా ఇన్వెస్ట్ ‌మెంట్ అథారిటీతో కలిసి స్పైస్‌ జెట్‌ ప్రమోటర్‌ అయిన అజయ్‌ సింగ్‌ ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నారు. ఎయిరిండియా లో నూరు శాతం వాటాను సొంతం చేసుకునేందుకు రస్‌ అల్‌ ఖైమా ఇన్వెస్ట్‌ మెంట్‌ అథారిటీతోపాటు ఢిల్లీకి చెందిన బర్డ్‌ గ్రూపు ప్రమోటర్‌ అంకుర్‌ భాటియాతో జతకట్టారు. సింగ్, భాటియా ఇరువురూ తమ వ్యక్తిగత హోదాలో ఎయిరిండియా కోసం బిడ్లు దాఖలు చేశారని సంబంధిత ఉన్న వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టాటా గ్రూపు సైతం ఎయిరిండియా కోసం పోటీపడుతోంది.