Begin typing your search above and press return to search.

హెలికాఫ్టర్ లో తీసుకెళ్లిన గర్భవతి ఏమైంది?

By:  Tupaki Desk   |   7 Dec 2015 3:23 PM GMT
హెలికాఫ్టర్ లో తీసుకెళ్లిన గర్భవతి ఏమైంది?
X
చుట్టూ వరద నీరు. ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితి. భర్త ఏమో ఊళ్లో లేడు. రాలేనంత దూరంలో ఉన్నాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పురిటి నొప్పులు వస్తే.. పరిస్థితి ఏంటి? ఎంత కష్టం.. ఎంత ఇబ్బంది. మరి.. ఆ విపత్కర పరిస్థితుల్లో దైవదూతల్లా వచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందం కాపాడటం తెలిసిందే.

చెన్నై మహానగరాన్ని వరదలు పట్టి పీడుస్తున్న వేళ.. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఒక మహిళకు పురిటి నొప్పులు రావటంతో ఆమెకు తక్షణ వైద్య సాయం అందించేందుకు హెలికాఫ్టర్ ను ఆమె ఉండే ఇంటి వద్దకు వెళ్లి.. టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ మీద ఎక్కించి.. అక్కడ నుంచి తాళ్ల నిచ్చెనను జార్చి.. జాగ్రత్తగా ఆమెకు హెలికాఫ్టర్ లో తీసుకెళ్లి వైద్యం సాయం అందించే ప్రయత్నం చేశారు. మరి.. అలా హెలికాఫ్టర్ లో తీసుకెళ్లిన ఆమె సంగతి ఏమైందన్న విషయంలోకి వెళితే..

ఇప్పుడామె పండంటి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. అంతేకాదు.. ఆమెకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చాయి. గర్భవతి పేరు దీప్తి(28).. ఆమె భర్త కార్తిక్ వెల్చామీ. వారు చెన్నై సమీపంలోని గిండీకి దగ్గరల్లో రామాపురం ప్రాంతానికి చెందిన వారు. మరో వారం రోజుల్లో డెలివరీ డేట్ ఇచ్చిన సమయంలో భారీ వర్షాలు పడటం.. బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవటం జరిగింది. సరైన సమయంలో భారత సైన్యం.. ఎయిర్ ఫోర్స్ వారు కలిసి.. అత్యంత సాహసోపేతంతో వ్యవహరించి.. ఆమెను కాపాడారు. ఇప్పుడామె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

వాస్తవానికి దీప్తి భర్త కార్తిక్.. పని మీద బెంగళూరు వెళ్లారు. వర్షాల కారణంగా ఆయన రాలేకపోయిన పరిస్థితి. తను ఇంట్లో లేని వేళ.. ఇంత సమస్య వచ్చి పడితే.. ఎలా అని విపరీతమైన ఆందోళన చెందిన వేళ.. ఇంత పెద్ద సాయాన్ని చేసిన ఎయిర్ ఫోర్స్.. ఆర్మీ సిబ్బందికి ఆయన చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. నిజానికి కార్తిక్ ఒక్కరే కాదు.. దీప్తి ఉదంతం తెలిసిన ప్రతిఒక్కరూ ఎయిర్ ఫోర్స్.. ఆర్మీకి హేట్సాఫ్ చెబుతున్నారు. సామాన్యుల కోసం సైన్యం ఇంత పెద్ద సాయం చేస్తే ఎవరు మాత్రం స్పందించకుండా ఉంటారు.