Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి స‌చివాల‌యంలో ప‌గుళ్లు?

By:  Tupaki Desk   |   15 July 2017 5:01 AM GMT
అమ‌రావ‌తి స‌చివాల‌యంలో ప‌గుళ్లు?
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు మ‌న‌సు బాధ‌ప‌డే మ‌రో ప‌రిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం బ్లాకులు బీటలు వారుతున్నాయి. ఈ బ్లాకుల్లో అంగుళం నుంచి రెండంగుళాల వెడల్పుతో గోడలు బీటలిస్తున్నాయి. ఆ పగుళ్లు బయటకు కనబడకుండా అత్యవసర మరమ్మతులుగా సిమెంట్‌ తో పైపూత పూశారు. తాత్కాలిక సచివాలయంలో ప్రభుత్వ పాలన ప్రారంభమై తొమ్మిది నెలలైంది. ప్రారంభించిన నెల రోజుల్లోపే ముఖ్యమంత్రి బ్లాకులోనే పగుళ్లుబయట పడ్డాయి. అనంతరం ఆర్థిక - ప్రణాళిక శాఖలున్న రెండో బ్లాకులోనూ అదే పరిస్థితి కనిపించింది. గోడలకు పైపూత పూసి రంగులు వేశారు. సచివాలయ ప్రాంగణంలో రోజూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ మరమ్మతులు సాగుతూనే ఉన్నాయని అంటున్నారు.

తాత్కాలిక సచివాలయ భవనాల్లో ప్రస్తుతం కనబడుతున్నవన్నీ గాలి పగుళ్లని (ఎయిర్‌ క్రాక్స్‌) మున్సిపల్‌ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇవి పెద్ద విషయం కాదని మరమ్మతులు చేస్తే ఎటువంటి ఇబ్బందులూ ఉండవని ఆయన వివ‌రించారు. ఈ విష‌యంలో అన‌వ‌స‌ర గంద‌ర‌గోళం సృష్టించ‌వ‌ద్ద‌ని కోరారు. కాగా, తాజాగా వెలుగులోకి ప‌రిణామాల‌పై ఉద్యోగులు క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించి భవన సముదాయాన్ని పటిష్ట పరచాల్సి ఉంటుందని సచివాలయ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కాగా, నేల స్వభావాన్ని బట్టి నిర్మాణాలుండాలని నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం నిర్మించిన ప్రాంతం మొత్తం నల్లరేగడి నేల. అలాంటి చోట్ల పునాది ఎక్కువ లోతు నుంచి బలిష్టంగా ఉండాలంటున్నారు. పిల్లర్లను జాయింట్‌ చేసే ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా వినియోగించక పోయినా నాణ్యత లోపిస్తుందంటున్నారు. సాధారణంగా ఇటుకకు ఇటుకకు మధ్య ఖాళీ ఏర్పడి భవనాల్లో పగుళ్లు వస్తుంటాయని, ఒకటో రెండో వస్తే గాలి పగుళ్లు అనుకోవచ్చని ఎక్కువగా బీటలు వస్తే నాణ్యత లోపంగానే పరిగణించాల్సి ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నుంచి పాలనను యుద్ధ ప్రాతిపదికన వెలగపూడికి తరలించడానికి ప్రభుత్వం తాత్కాలిక నిర్మాణాలు చేయించింది. సుమారు 42 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ - సచివాలయ భవనాలను నిర్మించారు. ఐదు బ్లాకులుగా నిర్మించిన తాత్కాలిక సచివాలయానికే సుమారు రూ.680 కోట్లు వెచ్చించారు. గతేడాది అక్టోబర్‌ మూడో తేదీన హడావుడిగా ఈ కొత్త భవనాలను ప్రారంభించారు. నిర్మాణ సమయంలోనూ, ఆ తర్వాతా సీఎం చంద్రబాబు సైతం నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే స‌చివాల‌యం విష‌యంలో లోప భూయిష్టమైన నిర్మాణంపై సంబంధిత కాంట్రాక్టర్‌ ను అప్పట్లోనే హెచ్చరించారని తెలిసింది.