Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రైల్వే స్టేషన్ ను తలపిస్తున్న ఎయిర్ పోర్టు!

By:  Tupaki Desk   |   7 Dec 2021 12:52 AM GMT
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రైల్వే స్టేషన్ ను తలపిస్తున్న ఎయిర్ పోర్టు!
X
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని... అందరూ కాస్త ఊపిరిపీల్చుకునేలోపే మహమ్మారి మరో రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది.

జెట్ స్పీడ్ తో వ్యాప్తి చెందే ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం ముందునుంచే అప్రమత్తమైంది. కాగా వైరస్ కట్టడికి ఆది నుంచి ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే దేశంలో ఇటీవల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో కేసులు వెలుగు చూశాయి.

ఇప్పుడిప్పుడే నిబంధనలు ఎత్తివేసే అవకాశం ఉందని అంచనా వేసిన తరుణంలో మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కాగా విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. ఫలితంగా ఎయిర్ పోర్టుల్లో రద్దీ వాతావరణం నెలకొంది.

ఇక్కడ మనం చూస్తున్నది రైల్వే స్టేషన్ అనుకుంటే పొరబడినట్లే. నిత్యం వేలాదిమంది విదేశీ ప్రయాణాలు సాగించే దిల్లీ ఎయిర్ పోర్టు. కరోనా పరీక్షల నిరీక్షణ నేపథ్యంలో దేశ రాజధానిలోని ఎయిర్ పోర్టు జనాలతో కిక్కిరిసిపోయింది. దిల్లీ ప్రధాన నగరం కాబట్టి దేశీయ, విదేశీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. అయితే ఇలాంటి ప్రదేశాల్లోనే వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.

దిల్లీ ఎయిర్ పోర్టులో కొవిడ్ పరీక్షల కోసం జనాలు క్యూ కట్టారు. కాగా ర్యాపిడ్ టెస్టులకు మూడు గంటల సమయం పడుతోందని అక్కడి ప్రయాణికులు చెబుతున్నారు. ఇకపోతే ఆర్టీపీసీఆర్ పరీక్షలకు దాదాపు ఎనిమిది గంటల పాటు వేచిచూడాల్సి వస్తోందని పేర్కొన్నారు. కాగా ప్రయాణికులు బారులు తీరారు. కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులోని ఇమ్మిగ్రేషన్ డెస్క్ కిక్కిరిసింది. ఇకపోతే ఎప్పుడూ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో అధికంగా కనిపించే జనాలు ఈసారి ఎయిర్ పోర్టులో కనిపించడం గమనార్హం.

ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్లు కూడా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. మరికొన్నాళ్ల పాటు స్వీయనియంత్రణ, మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటివి పాటించాలని అంటున్నారు.

అయితే దేశంలో ఇప్పటికే ముంబయి, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోల పట్ల నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కాగా కరోనా పరీక్షల ఏమో కానీ పరీక్షల కోసం ఎదురుచూసే సమయంలోనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు.