Begin typing your search above and press return to search.

కొత్త సీఎస్ ఎవరో?

By:  Tupaki Desk   |   29 July 2016 7:02 AM GMT
కొత్త సీఎస్ ఎవరో?
X
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం ఇద్దరు సీనియర్ అధికారులు పోటీ పడుతున్నారు. ప్రస్తుత సీఎస్ ఠక్కర్ పదవీకాలం ఆగస్టు నెలాఖరుతో ముగియనుండటంతో కొత్త సీఎస్ రేసులో ఇద్దరు అధికారులు ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ ఒకే బ్యాచికి చెందిన అధికారులు కావడంతో ఎవరికి అవకాశం వస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అయితే.. వారిద్దరితో పాటు మరో సీనియర్ ఐఏఎస్ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

సీఎస్ రేసులో 1983 బ్యాచ్‌ కి చెందిన అజయ్ కల్లం - దినేష్‌ కుమార్ ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. వీరిద్దరూ కాకుండా ప్రస్తుతం సీసీఎల్‌ ఏగా ఉన్న అనిల్‌ చంద్ర పునేఠా కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి పరిస్థితి ప్రకారం అజయ్‌ కల్లం అందరికంటే ముందున్నట్లు సమాచారం. ఢిల్లీకి చెందిన దినేష్‌ కుమార్ కోసం ఎయిర్‌ పోర్టుల నిర్మాణంలో పేరున్న ఒక కంపెనీ అధిపతి ప్రయత్నిస్తున్నారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న దినేష్‌ కుమార్ ప్రస్తుతం పంచాయితీరాజ్ - గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నారు. ఆయనకు మంచి అధికారిగా పేరుంది.

నిజాయితీపరుడిగా పేరున్న కల్లానికి ఎప్పుడూ, ఎవరికీ ఇవ్వనన్ని శాఖలు కేటాయించడం కూడా ఆయన ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తోంది. ఫైనాన్స్ - రెవిన్యూ - ఎక్సైజ్ - కమర్షియల్ టాక్స్ - స్టాంప్ అండ్ ఎక్సైజ్ - ప్లానింగ్ వంటి కీలక శాఖలన్నీ కల్లం పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు గతంలో సీఎంగా పనిచేసినప్పుడు కూడా ఒకే అధికారికి ఇన్ని శాఖలు కట్టబెట్టిన దాఖలాలు లేవని అధికారవర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ కోణంలో పరిశీలించినా అజయ్ కల్లానికి సీఎస్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలుండవచ్చని సమాచారం.

మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా ఉన్న ఒక అధికారి మాత్రం సీసీఎల్‌ ఏగా ఉన్న అనిల్‌ చంద్ర పునేఠా కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆయన రేసులో ఉన్న అజయ్ కల్లం - దినేష్‌ కుమార్ కంటే జూనియర్ అయినందున - అవకాశాలు తక్కువే. అదేసమయంలో ప్రస్తుత సీఎస్ ఠక్కర్ మరో మూడునెలల పొడిగింపు అవకాశాల కోసం అభ్యర్ధిస్తున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.