Begin typing your search above and press return to search.

అజిత్ పవార్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. నోట మాట రాదంతే

By:  Tupaki Desk   |   23 Nov 2019 12:25 PM GMT
అజిత్ పవార్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. నోట మాట రాదంతే
X
ఇవాళ ఉదయం వరకూ కూడా అజిత్ పవార్ అనే నేత.. ఎన్సీపీ నేత. పేరు చివరన ఉన్న పవార్ కారణంగా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బంధువు అన్న భావన చాలామందికి తెలుసు. అంతకు మించి ఆయన గురించి పరిచయం తక్కవనే చెప్పాలి. నిత్యం రాజకీయాల్లో కాలం గడిపే వారికి.. వివిధ రాష్ట్రాల రాజకీయాలతో పాటు.. జాతీయ రాజకీయాల్ని నిశితంగా పరిశీలించే వారికి అజిత్ పవార్ ఎవరన్నది అవగాహన ఉంటుంది. మిగిలిన వారందరికి ఆయన సుపరిచితుడేం కాదు.

మహా ట్విస్టు ఇస్తూ బీజేపీ ప్రభుత్వం కొలువు తీరేందుకు సాయం చేసి.. సొంత పార్టీ అధినేతకు హ్యాండిచ్చి.. పార్టీలో చీలకకు కారణమైన అజిత్ పవార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఎవరాయన? శరద్ పవార్ కు ఏమవుతారు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆయన ఎలాంటోడు? ఆయన మీద ఉన్న వివాదాలు ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. మోడీషాల ఛాయిస్ ఎలాంటిదో ఇట్టే అర్థం కాక మానదు.

అరవైఏళ్ల అజిత్ పవార్ అసలు పేరు.. అజిత్ అనంతరావ్ పవార్. ఇతగాడు ఎవరో కాదు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్న కుమారుడు. పూనే నివాసి అయిన ఆయనకు ఇద్దరు పిల్లలు. ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన గతంలో మంత్రిగా వ్యవహరించారు కూడా. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయగా.. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అజిత్ పవార్ తండ్రి పేరెన్నిగన్న ఫిలింమేకర్ గా మంచి పేరుంది.
అన్న కొడుకు కావటంతో శరద్ పవార్ దగ్గరకు తీసుకున్నారు. రాజకీయాల్లో ఓనామాలు నేర్పించారు. పలు పదువులు వచ్చేలా చేశారు. తర్వాతి కాలంలో ఎంపీగా వ్యవహరిస్తున్న సందర్భంలో శరద్ పవార్ కోసం తన పదవికి రాజీనామా చేయటం ద్వారా తన విధేయతను చాటుకునేవాడు. పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో శరద్ పవార్ కోసం ఎంపీ పదవిని త్యాగం చేశారు.

తర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా వ్యవహరించారు. రాజకీయంగా అజిత్ కు అంత మంచి పేరు లేదు. నోటి దురుసుతనం.. ఎలా పడితే అలా మాట్లాడటం.. కించపరిచే తత్త్వం ఎక్కువన్న విమర్శ ఉంది. ఈ కారణంతో పలు వివాదాల్లో కూరుకుపోయారు. 2013లో మహారాష్ట్రలో కరవు తీవ్రంగా ఉన్న వేళ.. షోలాపూర్ కు చెందిన ఒక రైతు నిరాహార దీక్షకు దిగాడు. కరవు నివారణకు.. ప్రజలు పడుతున్న కష్టాలకు నాటి ప్రభుత్వం ఏమీ చేయటం లేదన్న ఆగ్రహంతో దీక్షను షురూ చేశారు.

సదరు రైతు అప్పట్లో 55 రోజుల పాటు దీక్ష చేశాడు. అప్పట్లో ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారి.. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది. ఇలాంటివేళలో మంత్రిగా ఉన్న అజిత్ పవార్ నోరు పారేసుకున్నారు. దీక్షను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. డ్యాముల నుంచి నీటిని విడుదల చేయాలని షోలాపూర్ లో ఒక వ్యక్తి 55 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు.. డ్యాముల్లో నీళ్లు రాలేదు. మేమేం చేయాలి. మూత్రం పోసి నింపాలా? అయినా తాగడానికి నీళ్లు లేనప్పుడు మూత్రం కూడా రాదు కదా? అంటూ బాధ్యతారాహిత్యంతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. వెనక్కి తన మాటలకు క్షమాపణలు చెప్పారు.

ఆ తర్వాత కూడా నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడింది లేదు. మహారాష్ట్రలో విద్యుత్ కొరతపై ఆయన స్పందిస్తూ.. జనాభా పెరగటమే విద్యుత్ కొరతకు కారణంగా పేర్కొన్నారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న వేళలోనూ రూ.70వేల కోట్ల మేర కుంభకోణానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తటంతో రాజీనామా చేశారు. ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడటం.. పని విషయంలోనూ ఆయన తీరు బాగోదన్న అభిప్రాయం ఉంది. మరి.. అలాంటి నేతను ఏరి కోరి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి ప్రమాణస్వీకారం చేయటం గమనార్హం.