Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్రంట్ ఏమైంది... మూసేశారా?

By:  Tupaki Desk   |   1 Oct 2018 6:19 AM GMT
కేసీఆర్ ఫ్రంట్ ఏమైంది... మూసేశారా?
X
దేశంలో కొందరు నేతలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. రాజకీయ పార్టీలకు అధినేతలుగా ఉంటూ - రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా - కీలక నేతలుగా ఉండే ఆ కొందరు నేతలు ఎప్పుడే పార్టీతో కలుస్తారో.. ఎవరిని ముంచేస్తారో అర్థం చేసుకోవడం కష్టం. సంకీర్ణ రాజకీయాల సమయంలో జాతీయ పార్టీల అవసరాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేశారు. ఏమాత్రం నమ్మరాని నేతలుగా ఇలాంటివారు పేరుపడ్డారు. జాతీయ పార్టీలకు మద్దతిచ్చి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా సహకరించి.. కొద్దికాలానికి మద్దతు ఉపసంహరించి ప్రభుత్వాన్ని కూలదోసేసిన పార్టీలు - నేతలు ఉన్నారు. అంతపెద్ద అవకాశం రాకపోయినా.. టీఆరెస్ అధినేత కేసీఆర్ కూడా తాజాగా తాను కూడా ఏమాత్రం నమ్మడానికి వీల్లేని నేతనని నిరూపించుకున్నారు. ముఖ్యంగా దేశంలోని ఇతర పార్టీలు ఈ సంగతిని అర్థం చేసుకున్నాయి.

కేసీఆర్ కొద్దికాలం కిందట బీజేపీ - కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు చేస్తానంటూ ఫెడరల్ ప్రంట్ పేరుతో బాగా హడావుడి చేశారు. అందుకోసం మమతా బెనర్జీని కలిశారు. కర్ణాటకలో దేవెగౌడ - కుమారస్వామిలనూ కలిశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎందరో నేతలతో మాట్లాడారు. కానీ... ఇప్పుడు అవన్నీ అటకెక్కేంచేశారు. దీంతో ఇతర పార్టీల అధినేతలు కేసీఆర్‌ను ఇంకెప్పుడూ నమ్మకూడదన్నట్లుగా ఉన్నారు.

తాజాగా... రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అజిత్ సింగ్ ఈ విషయంపై కేసీఆర్‌ ను ప్రశ్నించారు. జాతీయ పార్టీలైన బీజేపీ - కాంగ్రెస్‌ తో సంబంధం లేకుండా ఏర్పాటు చేస్తామని - 2 నెలల పాటు దేశం లోని పలు రాష్ట్రాలు తిరిగి నేతలను కలసి చివరకు దాని ఊసేలేకుండా పోయిందని ఎద్దేశా చేశారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించి తర్వాత ఫ్రంట్‌ ప్రస్తావనే లేకుండా పోయిందని విమర్శించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) నిర్వహించిన ‘పాలమూరు ప్రజాగర్జన’ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ కోసం 1,200 మంది యువత బలిదానం చేసుకున్నారని - ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్ష కోసమే పార్లమెంటులో బిల్లు సందర్భంగా మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ లాంటి ఉద్యమం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుకాలేదని - తెలంగాణ బిడ్డలు దోపిడీకి గురయ్యారన్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణలో నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండో దశ పోరాటం కోదండరాం నేతృత్వంలో పాలమూరు నుంచే ప్రారంభం కావాలన్నారు.