Begin typing your search above and press return to search.

అజ్మీర్ దర్గా గురువు మాట విన్నారా?

By:  Tupaki Desk   |   29 July 2016 7:29 AM GMT
అజ్మీర్ దర్గా గురువు మాట విన్నారా?
X
అందరూ ఒకేలా ఉండరన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు అజ్మీర్ దర్గా అధ్యాత్మిక గురువు జైనుల్ అబెదిన్ అలీఖాన్. మతం ఏదైనా అందులో అతివాదులు.. మితవాదులు ఉంటారు. అతివాదుల్ని చూసి అదే వారి మతంగా భావిస్తే తప్పులో కాలేసినట్లే. అదే సమయంలో మితవాదుల మాటల్నే ప్రాతిపదికగా తీసుకుంటే అతివాదుల మాటల కారణంగా జరిగే నష్టాన్ని కంట్రోల్ చేయటం కష్టమవుతుంది.

తాజాగా గోమాంసం మీద జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆ మధ్యన అయితే దేశ వ్యాప్తంగా గో మాంసం మీద పెద్ద రచ్చే జరిగిన పరిస్థితి. అయితే.. ఇలాంటి ఇష్యూలు చోటు చేసుకున్న సందర్భంగా ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునేలా వ్యాఖ్యలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ.. సమస్యను పరిష్కరించేలా.. సమిసిపోయేలా ఉండే మాటలు చాలా తక్కువగా వినిపిస్తుంటాయి. నిజానికి ఇలాంటి వాటి విషయంలో విచక్షణతో వ్యవహరించాల్సిన మీడియా కూడా అత్యుత్సాహంతో వన్ సైడ్ వాదనల్ని వినిపించే దుస్థితి ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.

మేం ఏం తినాలన్నది ఎవరో ఎందుకు చెప్పాలి? ఎవరి కోసమో మా ఆహార అలవాట్లు ఎందుకు మార్చుకోవాలి? గో మాంసం తినొద్దంటారు కాబట్టి.. మేం దాన్నే తింటామనే వాళ్లు కనిపిస్తారు. కానీ.. అలాంటి చేష్టలు లేనిపోని ఉద్రిక్తతలు పెంచేవిగా ఉంటాయని.. సెంటిమెంట్ ఎవరికైనా ఒకేలా ఉంటుందని.. ఒకరి మనోభావాల్ని మరొకరు గౌరవించుకోవాలని చెప్పేటప్పుడు గో మాంసం విషయంలో ఆ లాజిక్ పని చేయదా? అని పలువురు ప్రశ్నిస్తుంటారు. అయితే.. దీనికి మీడియాలో సూటి సమాధానం కనిపించదు. ఇదిలా ఉంటే.. ఒక కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు అజ్మీర్ దర్గా అధ్యాత్మిక గురువు జైనుల్ అబెదిన్ అలీఖాన్.

‘‘గోసంరక్షణ పాటించి ముస్లింలు ఆదర్శంగా నిలవాలి. గోవులంటే హిందువులకు ఎంతో పవిత్రం. గొడ్డు మాంసం విషయంలో హింసకు ప్రేరేపిస్తున్నవారు దానికి స్వస్తి పలకాలి. మతతత్వ శక్తులకు ఈ అంశం ఒక అయుధంగా మారింది. దేశ ప్రయోజనాల రీత్యా ఇరువర్గాల వారు మతసహనం.. సమైక్యతకు కృషి చేయాలి’’ అంటూ తాను చెప్పాల్సిన మాటను చెప్పేశారు. ఒకరి సెంటిమెంట్ ను మరొకరు గౌరవించుకోవటం తప్పేం కాదు కదా?