Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కి మెట్రో తెచ్చింది నేనే , కానీ పాతబస్తీకి దిక్కులేదు : అక్బరుద్దీన్

By:  Tupaki Desk   |   17 Sep 2020 11:50 AM GMT
హైదరాబాద్ కి మెట్రో తెచ్చింది నేనే , కానీ పాతబస్తీకి దిక్కులేదు :  అక్బరుద్దీన్
X
ఈ సువిశాలమైన భారతావనిలో హైదరాబాద్‌ శర వేగంగా అభివృద్ధి చెందుతూ, హైటెక్‌ సిటీ ప్రాంతం గత 20 ఏళ్లలో ఎంతో పురోగమించి ఇప్పుడు భారతదేశ న్యూయార్క్‌గా గుర్తింపు పొందిందని మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ తెలిపారు. కానీ 400 ఏళ్ల చరిత్ర ఉన్న పాతబస్తీ లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతబస్తీపై కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలని, పాత నగరానికి ఐటీ సెంటర్‌ రావాలని డిమాండ్‌ చేశారు. పలు దఫాలుగా చెప్పినట్టుగా సీఎం హామీల అమలు కోసం తామంతా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.

హైదరాబాద్, ఇతర మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనపై బుధవారం సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. పాతబస్తీ అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ఇప్పుడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేశ్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రం స్పీకర్‌ గా ఉండగా, చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు ప్రారంభమైందని, ఆ ప్రాజెక్ట్ నేటికీ ఇంకా పూర్తికాలేదు అని, అలాగే హైదరాబాద్ పాతనగరంలోని అద్భుత నిర్మాణాలు దెబ్బతింటున్నాయని, వాటిని పరిరక్షించే చర్యలు చేపట్టడం లేదని , దానిపై కొంచెం దృష్టి పెట్టాలని కోరారు. పాతనగరంలో పార్కింగ్‌ టవర్లను పూర్తి చేయాలని కోరారు. నవ యవ్వనంలో అసెంబ్లీలో అడుగుపెట్టిన నువ్వు జుట్టు నెరిసి వృద్ధుడివి అవుతున్నావు తప్ప పాతబస్తీ అభివృద్ధి చెందటం లేదని ప్రజలు తనను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందంటే అది తన వల్లేనని, దీన్ని చాలెంజ్‌ చేసి చెప్తానని అన్నారు.

పీజేఆర్‌ మోనో రైల్‌ కోసం, తాను మెట్రో కోసం పోటీ పడగా అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనను ఢిల్లీకి పంపి మెట్రో రైలు ప్రాజెక్టు పరిశీలించి రమ్మన్నారని, ఆ తర్వాతనే నగరానికి మెట్రో వచ్చిందని, కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాతబస్తీకి మాత్రం మెట్రో యోగం లేదా అని ప్రశ్నించారు. కృష్ణా ఫేజ్‌–2 పాతనగరం కోసం ఏర్పాటైందని, కానీ కొత్త నగరంలో అమలవుతున్నట్టు పాతనగరానికి రోజువిడిచి రోజు నీళ్లు రావటం లేదన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగినట్టుగానే, నీటి విషయంలో పాతబస్తీకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.