Begin typing your search above and press return to search.

అక్బరుద్దీన్ కు అరుదైన పదవి!

By:  Tupaki Desk   |   22 Sep 2019 3:52 PM GMT
అక్బరుద్దీన్ కు అరుదైన పదవి!
X
తెలంగాణ విభజన - కాంగ్రెస్ వైఫల్యం కారణంగా... ఈరోజు ఒక అతిచిన్న పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కడమే కాదు - పీఏసీ పదవి దక్కింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పీఏసీ చైర్మన్ పదవి ఎమ్ ఐఎమ్‌ కు దక్కింది. ఆ పార్టీ శాసనసభ పక్ష నేత అయిన అక్పరుద్దిన్ ఒవైసీ పీఏసీ ఛైర్మన్‌ గా నియమితులయ్యారు.

గత డిసెంబరులో తెలంగాణ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. అయితే - 12 మంది సభ్యులు పార్టీ మారి అధికార పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. కాంగ్రెస్ కంటే ఒక సీటు ఎక్కువ ఉన్న ఎమ్ ఐఎమ్ ప్రతిపక్ష పార్టీ అయ్యింది. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష పార్టీకి దక్కే పీఏసీ పదవి ఎమ్ఐఎమ్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన అక్బరుద్దీన్ కు దక్కింది. ఆ పదవి కావాలని కొన్ని రోజులు ఆ పార్టీ కూడా కోరుతోంది. కేసీఆర్ వారి కోరికను మన్నించారు. ఫ్రెండ్లీ పార్టీకి కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చేశారు.

దీంతో ఇంకొన్ని పదవుల నియామకం కూడా పూర్తయ్యింది. అంచనాల కమిటీ చైర్మన్‌ గా దుబ్బాక ఎమ‍్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియమితులయ్యారు. పబ్లిక్ అండర్‌ టేకింగ్ కమిటీ చైర్మన్‌ గా ఆశన్నగారి జీవన్‌ రెడ్డి - సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు - ప్రకాశ్‌ గౌడ్ - అబ్రహం - శంకర్‌ నాయక్ - దాసరి మనోహర్‌ రెడ్డి - నల్లమోతు భాస్కర్‌ రావు - అహ్మద్ పాషా ఖాద్రీ - కోరుకంటి చందర్‌ లు నియమితులయ్యారు. ఈ సమావేశాల్లో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజును ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో ఈ తంతు పూర్తయ్యింది. ఈ కార్యక్రమం అనంతరం సభ నిరవధికంగా వాయిదాపడింది.

కొసమెరుపు - కేసీఆర్ అప్రతిహతమైన గెలుపు వల్ల - ఫిరాయింపులు - విలీనం వల్ల అనూహ్యంగా ఈ పదవి ఎంఐఎంకు దక్కింది. ఇది ఒక అరుదైన సందర్భమని చెప్పాలి. భవిష్యత్తులో మళ్లీ ఈ అవకాశం ఆ పార్టీకి మళ్లీ ఎంతకాలానికి వస్తుందో మరి. !!