Begin typing your search above and press return to search.

వారు హైద‌రాబాద్ దాటితే.. నోటీసులే నోటీసులు

By:  Tupaki Desk   |   26 Oct 2015 8:00 AM GMT
వారు హైద‌రాబాద్ దాటితే.. నోటీసులే నోటీసులు
X
హైద‌రాబాద్ పాత బ‌స్తీకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన మ‌జ్లిస్ పార్టీని దేశంలోని ప‌లు ప్రాంతాల్లోకి విస్త‌రించాల‌ని.. త‌మ ప‌ర‌ప‌తిని జాతీయ‌స్థాయిలో పెంచుకోవాల‌న్న ప్ర‌య‌త్నాన్ని ఓవైసీ సోద‌రులు తీవ్రంగా కృషి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరి ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లే తెలుగేత‌ర రాష్ట్రాల్లోనూ వారు విజ‌యం సాధించ‌టం వారికి మ‌రింత ప్రోత్సాహ‌క‌రంగా మారింది.

మ‌జ్లిస్ తో ఎంత ప్ర‌మాద‌క‌ర‌మన్న విష‌యం ప‌లురాష్ట్రాల్లోని రాజ‌కీయ పార్టీల‌కు పెద్ద‌గా అనుభ‌వం లేదు. ఈ కార‌ణంతోనే.. ఆ మ‌ధ్య మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌జ్లిస్ ను త‌క్కువగా అంచ‌నా వేసిన వారికి షాకిస్తూ.. రెండు చోట్ల మ‌జ్లిస్ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. దీంతో మ‌హారాష్ట్రలోని ప‌లు పార్టీల‌కు ఈ విజ‌యం షాకిచ్చింది. మ‌రోవైపు తాజా విజ‌యం మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ.. ఆయ‌న సోద‌రుడు అక్బ‌రుద్దీన్ ఓవైసీలకు విప‌రీత‌మైన ఆనందాన్ని ఇచ్చాయి. తాము అనుకున్న‌ట్లే ఇత‌ర రాష్ట్రాల్లోనే తాము పాగా వేయ‌గ‌ల‌మ‌న్న విష‌యం మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు తేల్చాయి.

దీంతో.. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా.. ముస్లిం మైనార్టీలు అత్య‌ధికంగా ఉండే నియోజ‌క‌వ‌ర్గాల్ని ఎంపిక చేసుకొని.. అక్క‌డి ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం జ‌రిపి మ‌రీ బ‌రిలోకి దిగుతున్న తీరు.. మిగిలిన పార్టీల‌కు ద‌డ పుట్టిస్తోంది. ప్ర‌స్తుతం బీహార్ ఎన్నిక‌ల‌తో పాటు.. మ‌హారాష్ట్రలోని పూణెలో జ‌ర‌గ‌నున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా ప్ర‌ద‌ర్శించాల‌ని మ‌జ్లిస్ భావిస్తోంది.

ఇందుకోసం త‌మ అమ్ముల పొదిలో అస్త్ర‌మైన మ‌సాలా ద‌ట్టించిన ప్ర‌సంగాలు చేయ‌టం మొద‌లు పెట్టారు. వీరి ప్ర‌సంగాల‌పై దృష్టి సారించిన పార్టీలు ఇప్పుడు గ‌గ్గోలు పెడుతున్నాయి. వీరి ప్ర‌సంగాల తీవ్ర‌త ఏ స్థాయిలో ఉంటుందో అర్థ‌మై.. పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నాయి. చూసీ చూడ‌న‌ట్లుగా వ‌దిలేస్తే.. త‌మకెంత ప్ర‌మాద‌మో అర్థం చేసుకున్న పార్టీలు మ‌జ్లిస్ బ్ర‌ద‌ర్స్ పై కేసుల మీద కేసులు పెడుతోంది.

ఇప్ప‌టికే రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేసిన ఆరోప‌ణ‌పై అస‌దుద్దీన్ కు నోటీసులు అందుకున్నారు. తాజాగా ఆయ‌న అస‌ద్ సోద‌రుడు అక్బ‌రుద్దీన్ కు సైతం నోటీసులు అందాయి. పూణెలో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి అక్బ‌రుద్దీన్ రాక‌ను నియంత్రిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. అంతేకాదు.. పూణెలో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల బ‌హిరంగ స‌భ‌ల‌కు హాజ‌రు కావొద్ద‌ని పేర్కొన్నారు. గ‌తంలో ఆయ‌న చేసిన ప్ర‌సంగాలు రెచ్చ‌గొట్టేలా ఉండ‌టంతో వివ‌ర‌ణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. వీటిని మ‌హారాష్ట్ర నుంచి ప్ర‌త్యేకంగా వ‌చ్చిన పోలీసులు అక్బ‌రుద్దీన్ చేతికి ఇచ్చి వెళ్లిపోయారు. ఓవైసీ బ్ర‌ద‌ర్స్ మాట‌ల మంట‌లు ప‌లు రాష్ట్రాల్లోని రాజ‌కీయ పార్టీల‌కు షాకుల మీద షాకులిస్తున్నాయ‌న్న మాట వినిపిస్తోంది.