Begin typing your search above and press return to search.

మోడీ, కేసీఆర్‌ ను ఏకేసిన ఓవైసీ

By:  Tupaki Desk   |   2 March 2017 11:23 AM GMT
మోడీ, కేసీఆర్‌ ను ఏకేసిన ఓవైసీ
X
దారుస్సలాం లో ఎంఐఎం పార్టీ 59 ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వ‌హించిన సంద‌ర్భంగా ఎంఐఎం పక్షనేత‌ - ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎంఐఎం పార్టీ జెండాను ఎగరువేసిన అనంత‌రం ఓవైసీ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అక్బరుద్దీన్ ఓవైసీ పొగడ్తలతో ముంచెత్తారు. అదే స‌మ‌యంలో త‌మ మ‌ద్దతు లేకుండా ఏ ప్ర‌భుత్వం తెలంగాణ‌లో ఏర్ప‌డ‌ద‌ని, మనుగ‌డ సాధించద‌ని వ్యాఖ్యానించారు. అదే స‌య‌మంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన త‌ర్వాతే ఎస్సీ - ఎస్టీల లతో సమానంగా ముస్లింలకు గౌరవం దక్కిందని అక్బ‌రుద్దీన్ ఓవైసీ అన్నారు. బడ్జెట్ లో ఏ ప్రభుత్వం కేటాయించనంతగా సర్కార్ నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఇండియాకు ఢిల్లీ రాజధాని అయితే ముస్లింలకు దారుస్సలాం, హైదరాబాద్ రాజధాని అని వ్యాఖ్యానించారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ముస్లిం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్ర‌స్తుతం తెలంగాణాలో ఎవరు సీఎం కావాలన్నా ఎంఐఎంని సంప్రదించాల్సిందేన‌ని అంతగా ఎంఐఎం పార్టీ ఎదిగిందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర -ముంబైల‌లో మజ్లీస్ దూసుకుపోతుందని, ఎంఐఎం త‌ర్వాతి టార్గెట్ కర్ణాటక అని తెలిపారు. దేశవ్యాప్తంగా మజ్లీస్ కి ఆదరణ పెరుగుతుందని, ఓటు బ్యాంకు పెరుగుతుందని అక్బ‌రుద్దీన్ విశ్లేషించారు.

దేశంలో రెడ్డి - రావు - ఇతర కులాల వారి గొంతు వినిపిస్తుందని, అయితే ఇప్పుడు గాడిదల గొంతు కూడా వినిపిస్తుందని ప‌రోక్షంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై అక్బ‌ర్‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక చాయ్ వాలా దేశ ప్రధాని ఆయిన తర్వాత చాయ్ వాలాలు పెరుగుతారు అనుకున్నాన‌ని అయితే గాడిదల గురించి చర్చ జరుగుతుందని ఊహించ‌లేద‌న్నారు. దేశంలో ఒక ఫేకు, ఒక పప్పు మాట్లాడుతున్నారని అక్బ‌రుద్దీన్ దుయ్య‌బ‌ట్టారు. వీరికి భయపడకుండా సమాధానం చెప్పేది ఎంఐఎం మాత్రమేన‌ని వ్యాఖ్యానించారు. ముస్లింలు వెనుకపడడానికి 60 సంవత్సరాలు ప‌రిపాలించిన కాంగ్రెస్ పార్టే కారణమ‌ని అక్బ‌ర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఒక చాయ్ అమ్మేవాడు ప్రధాని అయ్యాడని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. దేశాన్ని సర్వ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. భోపాల్ లో కేసు విచారణలో ఉన్న వారిని టెర్రరిస్ట్ అని ఎన్ కౌంటర్ చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆలేరులో జరిగిన వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై న్యాయం జరిగే వరకు పోరాడుతామ‌ని అక్బ‌రుద్దీన్‌ ప్ర‌క‌టించారు. ఆలేరు ఎన్ కౌంటర్ లో పోలీసుకు శిక్ష పడేవరకు పోరాడుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ అంశాన్ని సరైన సమయంలో తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వాని ప్రశ్నిస్తామ‌న్నారు. ఎన్నో ప్రభుత్వాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ మజ్లీస్ కు లొంగిపోక తప్పలేదని వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/