Begin typing your search above and press return to search.

ఎప్పుడేం చేయాలో బ్రదర్స్ కు బాగా తెలుసా?

By:  Tupaki Desk   |   1 Oct 2015 8:47 AM GMT
ఎప్పుడేం చేయాలో బ్రదర్స్ కు బాగా తెలుసా?
X
రెండు రోజుల క్రితం తెలంగాణ అధికారపక్షంపై రైతుల ఆత్మహత్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటమే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ కు తన వాగ్ధాటితో తలంటారు మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. పిట్టకథ చెప్పి కేసీఆర్ సర్కారు గాలి తీసిన అక్బరుద్దీన్ వైఖరికి కుతకుతలాడిపోయిన కేటీఆర్.. అక్బర్ పై శివాలెత్తే ప్రయత్నంలో సూటిగా మాట్లాడాలని అనటం.. దానికి జవాబుగా.. తాము సూటిగానే మాట్లాడతామని.. అధికారపక్షం చేత చెప్పించుకునే దుస్థితిలో తాము లేమంటూ ఘాటుగా బదులిచ్చారు.

మిత్రపక్షంగా ఉండే మజ్లిస్.. టీఆర్ ఎస్ మధ్య ఈ మాటల మంటలు చూసి పలువురు ఆశ్చర్యపోయారు. తెలంగాణ అధికారపక్షానికి షాకిచ్చే సరైనోడు దొరికాడంటూ అక్బరుద్దీన్ ను మెచ్చుకున్న వారూ లేకపోలేదు. తెలంగాణ అధికారపక్షాన్ని తీవ్రంగా వ్యతిరేకించే పలువురు అక్బరుద్దీన్ మాటలకు ఫిదా అయిపోయిన పరిస్థితి.

ప్రధాన ప్రతిపక్షంలోని కాంగ్రెస్ నేతలు ఎవరూ ఈ స్థాయిలో ధాటిగా మాట్లాడకపోవటం.. టీ టీడీపీ నేతలు అంతంతమాత్రంగానే మాట్లాడటం.. ఫైర్ బ్రాండ్ కిషన్ రెడ్డి సైతం అక్బరుద్దీన్ స్థాయిలో విరుచుకుపడకపోవటం చూసిన వారంతా.. తెలంగాణ అధికారపక్షానికి సరిగ్గా సమాధానం చెప్పగలిగిన సత్తా అక్బరుద్దీన్ కు మాత్రమే ఉందని డిసైడ్ అయ్యారు.

ఇదిలా ఉంటే గురువారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత.. అక్బరుద్దీన్.. లాబీల్లోని మంత్రి కేటీఆర్ కార్యాలయంలోకి వెళ్లటం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అక్బర్.. కేటీఆర్ ల మధ్య నడిచిన మాటల యుద్ధం నేపథ్యంలో వీరి మధ్య దూరం పెరుగుతుందన్న అంచనాలకు భిన్నంగా కేటీఆర్ ను కలవటం గమనార్హం. అయితే.. మజ్లిస్ ట్రాక్ రికార్డును నిశితంగా పరిశీలించిన వారికి ఇవేమీ కొత్త విషయాలుగా అనిపించవు.

సభలో పులిలా గర్జిస్తూ ఉండే ఓవైసీ సోదరులు.. అధికారపక్షంతో సున్నం పెట్టుకోవటానికి ఏమాత్రం ఇష్టపడరు. వైఎస్ హయాం నుంచి చూస్తే.. గడిచిన పదకొండేళ్లలో అధికారంలో ఉన్న వారిపై అసెంబ్లీలో విషయాల మీద విరుచుకుపడినా.. వ్యక్తిగతంగా మాత్రం సంబంధాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. సభలో పులిలా గర్జించి.. సభ బయట పిల్లిలా ఉండటం.. అవసరమైతే తామే వెళ్లి కలవటం.. అధికారపక్ష నేతల్ని కుశల ప్రశ్నలు వేయటం లాంటివి చేయటం కనిపిస్తుంది.

ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో.. ఓవైసీ సోదరులకు మధ్య నడిచిన తెర వెనుక యుద్ధం తెలిసిందే. అయినప్పటికీ.. కిరణ్ తో ఆచితూచి వ్యవహరించారే తప్పించి.. ముఖాముఖి సమరానికి మాత్రం సై అనకపోవటం కనిపిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించటం ఓవైసీ సోదరులకు అలవాటే. అధికారపక్షంతో గొడవ పెట్టుకొని.. లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టుకునే కన్నా.. వారితో రాజీ పడుతూనే.. అవసరానికి తగ్గట్లుగా వ్యవహరించే చిత్రమైన వ్యూహాన్ని అమలు చేయటం వారికేం కొత్త కాదు.

అధికారపక్షం కానీ తమవైపు ఒకచూపు చూస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఓవైసీ సోదరులకు తెలియంది కాదు. అందుకు ఎప్పుడేం చేయాలో అదే చేస్తూ.. తమ పట్టు సడలకుండా.. అధికారపక్షంతో తమ బంధం తెగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకునే ఓవైసీ సోదరులకు తెలివితేటలు చాలా ఎక్కువే సుమా.