Begin typing your search above and press return to search.

సర్కారు లెక్కపై కన్వీన్స్ కాని కేసీఆర్ ఫ్రెండ్

By:  Tupaki Desk   |   20 Dec 2016 4:54 AM GMT
సర్కారు లెక్కపై కన్వీన్స్ కాని కేసీఆర్ ఫ్రెండ్
X
వన్ సైడ్ లవ్ గురించి విన్నాం. కానీ.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని చూస్తే.. వన్ సైడ్ ఫ్రెండ్ షిప్ కూడా చూసే అవకాశం కలుగుతుంది. మరే రాజకీయ పార్టీ విషయంలోనూ ఉదారంగా వ్యవహరించని ముఖ్యమంత్రి కేసీఆర్.. మజ్లిస్ విషయానికి వస్తే మాత్రం.. ఆచితూచి మాట్లాడతారు. ఆ పార్టీ తమకు మిత్రపక్షంగా ఆయన తరచూ అభివర్ణిస్తారు. ఎన్నికల్లో ఎవరికి వారుపోటీ చేసినా.. తమ మధ్యన ఉండేది ఫ్రెండ్లీ పోటీ అనే మాటను చెబుతుంటారు.

ఎన్నికల సందర్భంగా తమ పార్టీ నేతలపై మజ్లిస్ నేతలు చేయి చేసుకున్నాకేసీఆర్ మాత్రం పెద్దగా పట్టనట్లుగా వ్యవహరిస్తారు. చివరకు తన సర్కారులోని ఉప ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి ప్రయత్నించిన మజ్లిస్ నేతలపైనా ఆయన చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తారన్న విమర్శ ఉంది. ఇంతలా కేసీఆర్ అభిమానం పొందిన పార్టీ మజ్లిస్ తప్ప మరొకటి లేదన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. మజ్లిస్ మీద కేసీఆర్ ఇంత ప్రేమను ఒలకబోసినా.. మజ్లిస్ మాత్రం తెలంగాణ అధికారపక్షం విషయంలో మాత్రం కరాఖండీగా ఉన్నట్లే కనిపిస్తుంటుంది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాటలే నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర ఆదాయం సూపర్ గా ఉందంటూ ఆర్థికమంత్రి ఈటెల చెప్పిన వాదనకు అక్బరుద్దీన్ ఏ మాత్రం కన్వీన్స్ కాకపోవటమే కాదు.. ఈటెల చెప్పిన మిగులు మాటలో నిజం లేదన్న విషయాన్ని స్పష్టం చేయటం గమనార్హం.

2014-15 బడ్జెట్ లెక్కల ప్రకారం రాష్ట్ర ఆదాయంలో మిగులు కనిపిస్తున్నా.. 2015-16 లెక్కల ప్రకారం రూ.4వేల కోట్ల లోటు ఉందన్న విషయాన్ని అక్బరుద్దీన్ చెప్పటం గమనార్హం. ప్రస్తుత ఏడాదిలోనూ ఖర్చు రూ.51వేల కోట్లు ఉండగా.. ఆదాయం మాత్రం రూ.47 వేల కోట్లు మాత్రమే ఉందని.. అలాంటప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం ఎలా అవుతుందని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన మెయింటెనెన్స్ ఛార్జీలు ఇప్పటివరకూ చెల్లించలేదని.. రీయింబర్స్ మెంట్ ఫీజులు కూడా ఇవ్వలేదన్న మాటను చెప్పిన అక్బరుద్దీన్.. మైనార్టీలకు ఇస్తున్న షాదీ ముబారక్ కింద కేవలం రూ.30కోట్లు మాత్రమే విడుదలయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వాదనతో తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రం కానే కాదని స్పష్టం చేసిన అక్బరుద్దీన్ మాట..ఆయన మిత్రుడు కేసీఆర్ కు ఇబ్బంది కలిగించేలా ఉందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/