Begin typing your search above and press return to search.

తిరుమలలో అఖండ దీపంపై వదంతులు నమ్మొద్దు

By:  Tupaki Desk   |   28 March 2020 7:50 AM GMT
తిరుమలలో అఖండ దీపంపై వదంతులు నమ్మొద్దు
X
దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించడంతోపాటు కరోనా వైరస్‌ కట్టడి కోసం ఎంతో చరిత్ర గల క్షేత్రం తిరుమలను మూసివేశారు. అయితే తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంపై పలు వదంతులు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వస్తున్నాయి. ఇందులో భాగంగా శతాబ్దాలుగా తిరుమల శ్రీవారి సన్నిధిలో వెలుగుతున్న అఖండ దీపం ఆరిపోయిందని ప్రచారం సాగుతోంది. ఆ దీపం ఆరిపోవడం వలన అనర్థాలు జరుగుతాయని - భవిష్యత్‌ లో ఆలయానికి ముప్పు ఏర్పడుతుందని పుకార్లు సృష్టిస్తున్నారు. అయితే వాటిని టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారు రమణ దీక్షితులు కొట్టిపారేశారు. అవన్నీ వట్టి పుకార్లేనని - వాటిని భక్తులు నమ్మొద్దని సూచించారు.

సోషల్‌ మీడియాలో అఖండ దీపంపై వచ్చే వదంతులను నమ్మొద్దు.. అవన్నీ అవాస్తవాలేనని ఈ సందర్భంగా మీడియాకు ఆయన చెప్పారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అయితే కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు మాత్రమే తిరుమలకు భక్తులు రాకుండా రహదారులను మూసివేసినట్లు తెలిపారు.

వాస్తవంగా తిరుమలలో రెండు అఖండ దీపాలున్నాయి. గర్భాలయంలో ఉన్న అఖండ దీపాలు బయట నుంచి భక్తులకు కనిపించవు. గర్భాలయంలోని రెండు మూలల్లోనూ రెండు నిలువెత్తు వెండి దీపాలు.. స్వామివారికి ఇరువైపులా రెండు నందా దీపాలు వేలాడుతూ ఉంటాయి. వీటిని ఉదయం సుప్రభాత సేవ సమయంలో అర్చకులు వెలిగిస్తుండగా రాత్రి ఏకాంత సేవలో స్వామివారు వేంచేసినప్పుడు ఈ దీపాలను ఆర్పివేస్తారని.. మళ్లీ తిరిగి మరుసటి రోజు ఉదయం సుప్రభాతం వేళ వెలిగిస్తారని వివరించారు.

అయితే ఆ పుకార్లు రావడానికి కారణం శ్రీవారి దేవాలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద అఖిలాండం ఆగిపోవడంతోనే చేశారని వివరణ ఇచ్చారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద భక్తులు కర్పూరం వెలిగించి.. కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో తిరుమల మూసివేయడంతో ఇప్పుడు భక్తులు ఎవరూ లేకపోవడంతో అఖిలాండం వద్ద కర్పూర దీపం ఆరిపోయింది. ఈ అఖిలాండం ఆరిపోవడంతో ఎలాంటి అపచారం జరగదు.. వైపరీత్యాలు కూడా ఏవీ సంభవించవని టీటీడీ నిర్వాహకులు చెబుతున్నారు. ఎవరో కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని.. వాటిని భక్తులు నమ్మొద్దని రమణ దీక్షితులు సూచిస్తున్నారు.