Begin typing your search above and press return to search.

అఖిలమ్మ హల్చల్ ...తాడో పేడో తేల్చుడే

By:  Tupaki Desk   |   20 Sep 2022 3:30 AM GMT
అఖిలమ్మ హల్చల్ ...తాడో పేడో తేల్చుడే
X

రాయలసీమలో భూమా నాగిరెడ్డి కుటుంబానికి ప్రత్యేక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కొన్ని దశాబ్దాల పాటు వారు కర్నూల్ జిల్లా రాజకీయాలను శాసించారు. భూమా నాగిరెడ్డి నంద్యాల ఎంపీగా ఉంటే ఆయన సతీమణి శోభానాగిరెడ్డి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలా భార్యాభర్తలు ఇద్దరూ రాజకీయల్లో చురుకైన పాత్ర పోషించారు. కానీ 2014 ఎన్నికలకు ముందు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదాన చ‌నిపోవడం అది తట్టుకోలేక మూడేళ్ళకే నాగిరెడ్డి కన్నుమూయడం జరిగిపోయాయి.

నాడు వారి కుటుంబం నుంచి పెద్ద‌ కుమార్తె అఖిలప్రియ అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశారు. అఖిలప్రియకు చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఆమె దూకుడు రాజకీయం అపరిపక్వ‌మైన నిర్ణయాల ఫలితంగా తండ్రి సంపాదించి పెట్టిన రాజకీయ పలుకుబడి బాగా కరిగిపోయింది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో భూమా ఫ్యామిలీకి సొంత గడ్డ అయిన ఆళ్ళగడ్డలోనే 2019 ఎన్నికల్లో అఖిలప్రియ ఓడారు. మూడేళ్ళుగా కూడా ఆమెకు అక్కడ ఏ విధంగానూ కలసిరావడంలేదు.

దాంతో ఆమె టీడీపీ అధినాయకత్వం మీద అనుమానం పెంచుకున్నారు. తనను కాకుండా అక్కడ వేరే వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు అన్న బాధతో ఆగ్రహంతో ఉన్నారు. దీంతో తనకు ఆళ్ళగడ్డ సీటు కేటాయించాల్సిందే అని ఆమె పట్టుబడుతున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ పట్టించుకోవడంలేదు. దీంతో ఆమె నంద్యాల నుంచి నరుక్కురావాలని చూస్తున్నారు. నంద్యాలలో పేచీ పెడితే ఆళ్ళగడ్డ సెట్ అవుతుందన్న సూపర్ ప్లాన్ తో ఆమె నంద్యాల టీడీపీలో కిరికిరీకి తెర తీశారని అంటున్నారు.

ఎవరికీ చెప్పకుండా పార్టీ పెద్దల అనుమతి లేకుండా హడావుడిగా ఆమె తాజాగా నంద్యాలలో పార్టీ ఆఫీస్ ని ప్రారంభించేశారు. అంటే దాని అర్ధం అక్కడ నుంచి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడమా అని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజానికి నంద్యాలలో ఆమె అన్న భూమా బ్రహ్మానందరెడ్డి ఇంచార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ అని కూడా అంటున్నారు.

అదే టైం లో నంద్యాలలో పూర్వం నుంచి పాతుకుపోయిన మాజీ మంత్రి ఫరూఖ్ కుటుంబం కూడా ఉంది. మరో వైపు సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఇలా నాయకులు అనేకమంది ఉన్న చోట అఖిలప్రియ హల్ చల్ చేయడం అంటే టీడీపీలో కొత్త కుంపట్లు పెట్టి మూడు ముక్కలాట ఆడేందుకే అని అంటున్నారు. ఇక అఖిలప్రియ నంద్యాలలో వేలూ కాలూ పెట్టడం మీద బ్రహ్మానందరెడ్డి అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు.

దాంతో అలెర్ట్ అయిన చంద్రబాబు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ద్వారా ఆమెను నంద్యాలలో ఎలాంటి జోక్యం పెట్టుకోవద్దని చెప్పాలని చూసింది కానీ అఖిలప్రియ వినలేదు. తాను అనుకున్నట్లుగానే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. అయితే దానికి టీడీపీ నుంచి ఎవరూ హాజరుకాకపోవడం విశేషం. అయితే తన తండ్రి నుంచి తనతో ఉన్న క్యాడర్ ని దగ్గరకు తీయడం ద్వారా ఆళ్ళగడ్డలో నో అంటే నంద్యాలలో పోటీకి రెడీ అవాలని అఖిలప్రియ వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు.

కానీ ఇక్కడ సొంత అన్న ఉన్నాడు. పైగా టీడీపీ అధినాయకత్వం ఈ సీటు ఇచ్చేందుకు ఎటూ ఒప్పుకోదు, అయితే ఇక్కడ కాకపోతే ఆళ్ళగడ్డలో అయినా తనకు కన్ ఫర్మ్ చేయమని డిమాండ్ చేయడానికే అఖిలప్రియ ఇలా చేస్తున్నారు అని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే చంద్రబాబు ఇటీవల జరిపిన సమీక్షలో సైతం అఖిప్రియకు ఆళ్ళగడ్డ మీద ఎలాంటి హామీ ఇవ్వలేదని అంటున్నారు. బాగా పనిచేయాలని మాత్రమే సూచించినట్లుగా చెబుతున్నారు. దాంతో అఖిలప్రియ ఇపుడు దూకుడు చేస్తున్నారు అని అంటున్నారు.

ఎన్నికలకు ఏణ్ణర్ధం మాత్రమే వ్యవధి ఉందని ఇప్పటి నుంచే సీటు తనది అనిపించుకోకపోతే రేపటి రోజున ఎలా పరిస్థితి ఉంటుందో అన్న ఆలోచనతోనే ఆమె నంద్యాలలో స్విచ్ వేశారు అని చెబుతున్నారు. మరి ఆళ్ళగడ్డలో లైట్ వెలుగుతుందా బాబు ఆమె వత్తిళ్లకు తలొగ్గి సీటు ఇస్తారా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఒక వేళ బాబు టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి జంప్ చేసే ఏర్పాట్లలో కూడా ఈ సీమ టీడీపీ మహిళా నేత ఉన్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. మొత్తానికి తగ్గేదే లే అంటున్న అఖిలప్రియ హై కమాండ్ తో ఢీ కొడుతున్నట్లుగానే అంతా భావిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.