Begin typing your search above and press return to search.

అఖిలేష్ గెలుపు ఖాయమేనా ?

By:  Tupaki Desk   |   17 Feb 2022 8:30 AM GMT
అఖిలేష్ గెలుపు ఖాయమేనా ?
X
ఎంతో రసవత్తరంగా జరుగుతుందనుకున్న పోటీ చివరకు ఏకపక్షం అయిపోయేట్లు కనిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కర్నల్ నియోజకవర్గంలో మొదటిసారి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అఖిలేష్ మొదటిసారి సీఎం అయినపుడు శాసనమండలి సభ్యుడు. 2017 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మైన్ పురి నియోజకవర్గంలో ఎంపీగా పోటీచేసి గెలిచారు. అంటే అఖిలేష్ అసెంబ్లీకి పోటీ చేయటమే మొదటిసారి.

పార్టీకి ఎంతో పట్టున్న కర్నూల్ నియోజకవర్గాన్ని అఖిలేష్ వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. 1993 నుండి ఇప్పటివరకు కేవలం 2002లో మాత్రమే ఇక్కడ ఎస్పీ ఓడిపోయింది. అంటే దీంతోనే పార్టీకి ఈ నియోజకవర్గం ఎంతటి కంచుకోటగా మారిపోయిందో అర్ధమవుతోంది. ఇలాంటి నియోజకవర్గంలో కేంద్రమంత్రి బఘేల్ బీజేపీ తరపున పోటీలోకి దిగారు. బఘేల్ కేంద్రమంత్రి కావటం, ఎస్సీ కావటంతో ఇద్దరి మధ్యా పోటీ బాగా రసవత్తరంగా ఉంటుందని అంతా అనుకున్నారు.

అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే అఖిలేష్ కు ఇక్కడ గెలుపు ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే నియోజకవర్గంలోని మొత్తం 3.7 లక్షల ఓటర్లలో 1.5 లక్షల మంది యాదవులే ఉన్నారు. అలాగే ఓబీసీలు 34 వేలు, ముస్లింలు 14 వేలమందున్నారు. యాదవులు, ముస్లింలు పూర్తిగా అఖిలేష్ కు మద్దతుగా ఉన్నారు.

అలాగే ఓబీసీలు కూడా ఎస్పీవైపున్నారు. పైగా అఖిలేష్ కు మద్దతుగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను దింపలేదు. దీంతోనే అఖిలేష్ గెలుపు ఖాయమని విశ్లేషకులంటున్నారు. అఖిలేష్ కు 1.25 లక్షల ఓట్ల మెజారిటీ వస్తుందని ఎస్పీ ధీమాగా ఉంది.

ఇదే సమయంలో తన గెలుపుపై బఘేల్ ధీమాగా ఉన్నారు. నరేంద్ర మోడీ, యోగి చరిష్మాతోనే తాను గెలుస్తానని కేంద్ర మంత్రి గట్టిగా చెబుతున్నారు. నియోజకవర్గంలో నిశ్శబ్ద విప్లవం ఉందని వాతావరణం పైకి ఎస్పీకి అనుకూలంగా కనిపిస్తున్నా చివరకు గెలిచేది తానే అని బఘేల్ అంటున్నారు. కేంద్రమంత్రి మాటలు నమ్మదగ్గవిగా లేకపోయినా అంతిమంగా ఏమి జరుగుతుందో చూడాల్సిందే.