Begin typing your search above and press return to search.

బీజేపీ ఎంఎల్ఏకి అఖిలేష్ బంపరాఫర్

By:  Tupaki Desk   |   18 Jan 2022 6:49 AM GMT
బీజేపీ ఎంఎల్ఏకి అఖిలేష్ బంపరాఫర్
X
ఉత్తరప్రదేశ్ ఒక బీజేపీ ఎంఎల్ఏకి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గాలమేస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ గోరఖ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు అయోధ్య నుండి లేదా మధుర నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుండి పోటీచేస్తారని బీజేపీ అగ్రనేతలు చెప్పారు. అయితే తాజాగా పై రెండు నియోజకవర్గాలు కాదని గోరఖ్ పూర్ నుండి పోటీచేయించేందుకు చివరి నిముషంలో ఎందుకు డిసైడ్ అయ్యారో తెలీదు.

ఇక్కడే అఖిలేష్ సీన్ లోని ఎంటరయ్యారు. ఎలాగంటే గోరఖ్ పూర్ లో సిట్టింగ్ ఎంఎల్ఏ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కు యోగీ పోటీ కారణంగా టికెట్ ఎగిరిపోయింది. అగర్వాల్ 2002 నుండి ఇక్కడే పోటీచేస్తున్నారు. అలాంటి సీనియర్ నేతకు యోగి కారణంగా అవమానం జరిగిందని అఖిలేష్ అభిప్రాయపడ్డారు. అగర్వాల్ గనుక గోరఖ్ పూర్ నుండే పోటీచేయాలని అనుకుంటే తమపార్టీలోకి వస్తే టికెట్ ఇస్తానంటు బంపరాఫర్ ఇచ్చారు. 2002 నుండి ఇక్కడే పోటీచేస్తున్నారంటే అగర్వాల్ కు మంచి పట్టుంటుందని అకిలేష్ అంచనా వేస్తున్నారు.

అందుకనే అగర్వాల్ కు అఖిలేష్ గాలమేస్తున్నారు. బీజేపీలో నుండి వచ్చిన వారందరికీ టికెట్లు ఇచ్చేది గ్యారెంటీ లేదని కూడా అఖిలేష్ చెప్పారు. కాకపోతే గోరఖ్ పూర్ ప్రత్యేకత కారణంగా అగర్వాల్ కు మినహాయింపు ఇస్తామంటు ఊరిస్తున్నారు. అయితే ఈ విషయమై అగర్వాల్ ఏ విధంగా కూడా స్పందించలేదు. కానీ బీజేపీ ప్రతినిధి శ్రీవస్తవ మాట్లాడుతు ఎస్పీకి చాలా చోట్ల గట్టి అభ్యర్ధులు లేరన్నారు. అందుకనే తమ ఎంఎల్ఏలకు అఖిలేష్ గాలమేస్తున్నట్లు మండిపడ్డారు.

ఏదేమైనా ఇప్పటికే ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎంఎల్ఏలు బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. ఇంకెతమంది పార్టీకి రాజీనామాలు చేసి ఎస్పీలో చేరుతారో అని బీజేపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే అధికారికంగా అఖలేషే గోరఖ్ పూర్ ఎంఎల్ఏ అగర్వాల్ ను ఎస్పీలోకి ఆహ్వానించటం గమనార్హం. మరి అగర్వాల్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. రెండు మూడు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు. చూడాలిమరి ఏమి జరుగుతుందో.