Begin typing your search above and press return to search.

త‌మ సీఎం అఖిలేష్ అంటున్న ములాయం

By:  Tupaki Desk   |   10 Jan 2017 5:35 AM GMT
త‌మ సీఎం అఖిలేష్ అంటున్న ములాయం
X
ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లోని స‌మాజ్‌వాదీలో జ‌రుగుతున్న కుటుంబ కుంపట్లలో మ‌రో ఊహించ‌ని ఎపిసోడ్‌. ఎస్పీలో ఓ వైపు వర్గపోరు తారస్థాయికి చేరుతుంటే మరోవైపు పార్టీ కురువృద్ధుడు ములాయంసింగ్ యాదవ్‌కు పుత్రప్రేమ పొంగుకొచ్చింది. తిరుగుబాటు చేసి వేరుకుంపటి పెట్టుకొన్న కుమారుడు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌పై ఆయన అపారమైన అభిమానం కురిపించారు. రాబోయే ఎన్నికల్లో తమపార్టీ తిరిగి అధికారంలోకి వస్తే అఖిలేశే సీఎం అవుతారని అనూహ్య‌మైన ట్విస్ట్ ఇచ్చారు.

మా పార్టీ సమైక్యంగా ఉంది.. ముక్కలయ్యే ప్రసక్తే లేదు.. అఖిలేశ్ మా పార్టీ తరఫున మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడుతారు అని ములాయం స్పష్టం చేశారు. అఖిలేశ్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు ససేమిరా అన్న ములాయం మాటమార్చడం గమనార్హం. త్వరలో యూపీ అంతా పర్యటించి పార్టీకి ఐక్యతా సందేశం ఇస్తామని, గందరగోళం తొలగిస్తామని ఆయన చెప్పారు. అఖిలేశ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారు అని ములాయం స్పష్టం చేశారు. అంతకుముందు ఢిల్లీలో ఎస్పీ ప్రత్యర్థి వర్గాలు పోటాపోటీగా ఈసీకి ఎన్నికల గుర్తుపై విజ్ఞాపనలు సమర్పించాయి. ములాయం స్వయంగా ఈసీని కలిసి తన వర్గానికి సైకిల్ గుర్తును కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అఖిలేశ్‌తో తనకు సమస్యలు లేవని అంటూ.. రాంగోపాల్ యాదవ్ వల్లే పార్టీలో సమస్య వచ్చిపడిందని మండిపడ్డారు.

ఇదిలాఉండ‌గా...ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే అందరి దృష్టి ఆ రాష్ట్రంలోని దళితులపై పడింది. రాజకీయ పార్టీల జాతకాలను తారుమారు చేయగల స్థాయిలో ఉన్న దళితులు ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్‌ లో 20.7 శాతం ఉన్న దళితులు ఏకపక్షంగా ఎటు వైపు మొగ్గు చూపితే ఆ రాజకీయ పార్టీ గణనీయమైన స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయం. దీంతో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ దళితులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ప్రారంభించాయి. కాగా ఈ ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై దళితులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తున్నది. దళితుల ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు ఆయా పార్టీలు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి చెప్పుకోదగిన దళిత నాయకుడెవరూలేరు. మహారాష్ట్రకు చెందిన రాందాస్ అఠవలె, బీహార్‌కు చెందిన రాంవిలాస్ పాశ్వాన్, ఉదిత్‌రాజ్‌లను రంగంలోకి దింపుతున్నది. అధికార సమాజ్‌వాదీ పార్టీ దళితుల విషయంలో బీజేపీ, బీఎస్పీల రాజకీయ అంచనాలను చెదరగొట్టేందుకు ఇటీవల 17 యాదవేతర ఓబీసీ కులాలను దళితుల్లో చేర్చాలని ప్రతిపాదించింది. ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ గతంలో తమ హయాం లో దళితుల అభివృద్ధికి చేపట్టిన చర్యలను గుర్తు చేస్తూ, తమ సందేశాలను కరపత్రాల రూపంలో పం చిపెడుతున్నది. కాంగ్రెస్ పార్టీ గత స్మృతులను గుర్తుచేస్తూనే దళితుల కోసం తమకు ప్రత్యేక మ్యానిఫెస్టో ఉందని ప్రచారం చేస్తున్నది. యూపీలో ఇదివరకే అడుగిడిన మజ్లిస్ పార్టీ భీమ్‌తోనే మీమ్ (దళితులతో ముస్లింలు) అంటూ రంగంలోకి దిగింది.

ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే దళితుల్లో ఒక్కొక్కరికి వేర్వేరు కారణాలున్నప్పటికీ వారి వైఖరి ఇప్పటికే ఒక స్పష్టతనిస్తున్నట్టు తెలుస్తున్నది. యూపీలోని దళితుల్లో 66 ఉప కులాలున్నాయి. వీటిలో ప్రధానంగా జాతవ్-చమర్, పాసీ, ధోబీ, కోరీ, వాల్మీకీ, ఖాటిక్ అనే ఉప కులాలకు చెందిన వారు దళితుల్లో 87 శాతం మంది ఉన్నారు. మిగిలిన 60 ఉపకులాల్లో ముసహర్, సపేరా, బాసర్, తాంత్వా తదితర కులాలకు చెందినవారు నామమాత్రపు సంఖ్యలో రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నారు. ఎన్నికల్లో వీరి ప్రభావం తక్కువే. దళితుల్లో ప్రధానమైన ఆరు ఉప కులాల్లో జాతివేతరులైన పాసీ, వాల్మీకి, ఖాటిక్‌లు సామాజికంగా, రాజకీయంగా హిందూత్వ వైపు మొగ్గు చూపుతారన్న అభిప్రాయం నెలకొంది. మత కల్లోలాలు చెలరేగిన ముజఫర్‌నగర్ - షామ్లీ - మవు - గోరఖ్‌ పూర్ వంటి జిల్లాల్లో వీరు ముస్లిం వ్యతిరేకులుగా ఉన్నారు. వీరి ముస్లిం వ్యతిరేకత బీజేపీకి ఓట్లుగా పరివర్తన చెందకపోవడం గమనార్హం. తాము గత ఎన్నికల్లో బీఎస్పీయేతర పార్టీలకు ఓట్లు వేశామని, ఈసారి నిర్ణయం మార్చుకున్నామని వాల్మీకి - పాసి - ఖాటిక్ ఉప కులాల వారు చెప్పారు. తమ సామాజిక-సాంస్కృతిక ప్రాధాన్యాలు, రాజకీయ దృక్పథం వేర్వేరని వారు స్పష్టం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/