Begin typing your search above and press return to search.

మీడియాపై క‌స్సుమ‌న్న కేటీఆర్ ఆప్తుడు

By:  Tupaki Desk   |   29 May 2018 1:23 PM GMT
మీడియాపై క‌స్సుమ‌న్న కేటీఆర్ ఆప్తుడు
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాత్ సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు మారుపేర‌నే సంగ‌తి తెలిసిందే. 15 రోజుల్లోగా బంగ్లాలు ఖాళీ చేయాలని ఆరుగురు మాజీ సీఎంలకు యోగీ ప్రభుత్వం పది రోజుల కిందటే నోటీసులు పంపించింది.ఈ ప‌రిణామం ఆ రాష్ట్రంలోని నాయ‌కుల‌కు అనూహ్య షాక్‌ ను ఇచ్చింది. అలా దిమ్మ‌తిరిగే షాక్ తిన్న వారిలో తెలంగాణ యువ మంత్రి కేటీఆర్ ఆప్తుడైన యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాద‌వ్ ఒక‌రు. ఈ యువ‌నేత దేశ రాజ‌కీయాల్లో క్రియాశీలంగా ముందుకు సాగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఈ స‌మయంలో ఆయ‌న మీడియాపై క‌స్సుమ‌న‌డం ఆస‌క్తిక‌రం.

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంలందరూ ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు సీఎం యోగీ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నిరాక‌రించారు.బంగ్లా ఖాళీ చేయడానికి రెండేళ్ల సమయంలో కావాలంటూ అఖిలేష్ - ఆయన తండ్రి ములాయం సుప్రీంకోర్టులో కౌంటర్ వేశారు. తన ఆరోగ్యం బాగా లేని కారణంగా సమయం కావాలని ములాయం కోరగా.. భద్రత, తన పిల్లల చదువు కారణంగా చూపుతూ రెండేళ్ల గడువు ఇవ్వాలని అఖిలేష్ కోర్టును కోరారు. తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లోక్‌ సభకు పోటీ చేయనున్నట్లు తెలిపారు. అనంత‌రం మాజీ సీఎంల విష‌యాన్ని మీడియా ప్రశ్నించగా.. అఖిలేష్ అసహనం వ్యక్తంచేశారు. ``మేం బంగ్లాలు ఖాళీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ కొంత సమయం కావాలి. లక్నోలో నాకు - మా నాన్నకు మరో ఇల్లు లేదు. మీరేదైనా ఇల్లు చూపిస్తే వెళ్తాం`` అంటూ మీడియాపై క‌స్సుమ‌న్నారు. మీరు ఈ అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. త‌మ‌కు చిత్త‌శుద్ధి ఉంద‌ని పేర్కొంటూ ఈ విష‌యంలో కొంత స‌మ‌యం మాత్ర‌మే తాము కోరుతున్నామ‌ని అఖిలేష్ అన్నారు.

ఇదిలాఉండ‌గా...యూపీ మాజీ సీఎం మాయావతి నిర్ణ‌యం ఆస‌క్తికరంగా మారింది. తన బంగ్లాను ఏకంగా తన గురువు, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జ్ఞాపకార్థం మ్యూజియంగా మార్చేశారు. ఐదు ఎకరాల్లో పది బెడ్‌ రూమ్‌ లతో ఎంతో విలాసవంతంగా ఉండే ఈ ఇంటికి శ్రీ కాన్షీరామ్ రామ్‌ జీ యాద్‌ గార్ విశ్రామ్ స్థల్ అంటూ మాయావతి ఓ బోర్డు ఏర్పాటు చేయించారు.