Begin typing your search above and press return to search.

అఖిలేశ్ రాహుల్ 'చేతి' ని అందుకుంటారా?

By:  Tupaki Desk   |   25 Oct 2016 10:17 AM GMT
అఖిలేశ్ రాహుల్ చేతి ని అందుకుంటారా?
X
ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీలో తండ్రీకొడుకుల మధ్య వర్గపోరు జాతీయ పార్టీలకు కలిసొస్తున్నట్లుగా కనిపిస్తోంది. జాతీయ పార్టీలతో ఢీ అంటే ఢీ అంటూ బలమైన రాజకీయ శక్తిగా ఉన్న సమాజ్ వాది పార్టీ ముక్కలయ్యే సూచనలు ఇప్పటికే కనిపిస్తుండగా.. ముఖ్యమంత్రి అఖిలేశ్ కాంగ్రెస్ నేత రాహుల్ కు దగ్గరయ్యే పరిస్థితులున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొద్దికాలంగా అఖిలేశ్ తీరు - వ్యాఖ్యలు... తాజా పరిణామాలు అన్నీ చూసుకుంటే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్-అఖిలేశ్ కాంబినేషన్ రంగంలోకి దిగడం ఖాయమంటున్నారు.

తన తండ్రి ములాయం సపోర్ట్ చేస్తున్న బాబాయ్ శివపాల్ వర్గాన్ని కాదని స్వతంత్రంగా పోటీ చేయడానికి అఖిలేష్ సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం ఆయన పరిశీలనలో ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ ను అఖిలేష్ పలుమార్లు బహిరంగంగానే ప్రశంసించడం... ఇప్పుడు రాజకీయ అవసరం అన్నీ కలిపి ఆయన్ను కాంగ్రెస్ కు చేరువ చేస్తాయని భావిస్తున్నారు.

ఇటీవల ప్రధాని మోదీని 'ఖూన్ కీ దళాయి' అంటూ రాహుల్ విమర్శించినప్పుడు రాహుల్ చేసిన విమర్శలు సమంజసమే అని అఖిలేశ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు... ఆలోచించకుండా రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేయరని వకాల్తా కూడా పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో తనకు పెద్దగా సంబంధాలు లేనప్పటికీ, రాహుల్ తో మాత్రం మంచి సంబంధాలు ఉన్నాయని అఖిలేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో, రానున్న ఎన్నికల్లో రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ తో అఖిలేశ్ వర్గం చేతులు కలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. అదేసమయంలో కాంగ్రెస్ కూడా యూపీలోని తాజా పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నిన్న అత్యున్నత సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఎస్పీ నుంచి అఖిలేశ్ వర్గం విడిపోయిన పక్షంలో అఖిలేశ్ వర్గంతో పొత్తు పెట్టుకోవాలని ఆమె నేరుగా తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/