Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్ట్ లో మ‌రో పార్టీ అధ్య‌క్షుడ్ని అడ్డుకున్నారు?

By:  Tupaki Desk   |   12 Feb 2019 1:30 PM GMT
ఎయిర్ పోర్ట్ లో మ‌రో పార్టీ అధ్య‌క్షుడ్ని అడ్డుకున్నారు?
X
రోజులు గ‌డిచే కొద్దీ రాజ‌కీయాలు అంత‌కంత‌కూ ద‌రిద్రంగా మారుతున్నాయి. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో రాజ‌కీయాలు అధ‌మ స్థాయికి చేరుకుంటున్నాయి. ప‌వ‌ర్ లో ఉన్న వారు త‌మ‌కు తోచిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఈ మ‌ధ్య‌న ఒక అల‌వాటుగా మారుతోంది. ప్ర‌త్య‌ర్థి కార‌ణంగా త‌మ‌కు రాజ‌కీయ న‌ష్టం జ‌రుగుతుంద‌న్న ఆలోచ‌న వ‌చ్చిందే త‌డ‌వు.. వారిపై నియంత్ర‌ణ‌.. ప‌రిమితుల‌తో వేధించ‌టం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

ఇటీవ‌ల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారి ప్ర‌త్య‌ర్థులు హెలికాఫ్ట‌ర్లో వ‌స్తుంటే.. వారికి అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌టం.. దానికి బ‌దులు అన్న‌ట్లు బీజేపీ చీఫ్ అమిత్ షాకు కోల్ క‌తాలో ప్ర‌యాణానికి మ‌మ‌త అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌టం ఈ మ‌ధ్య‌న సంచ‌ల‌నంగా మారింది. బీజేపీ నేత‌లు ప‌లువురు దీదీ తీరును త‌ప్పు ప‌ట్టారే కానీ.. తాము ఆ తానులో ముక్క‌ల‌మేన‌న్న విష‌యాన్ని మ‌రిచారు.

తాజాగా అలాంటి ప‌నే చేసింది యూపీ స‌ర్కారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి.. స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాద‌వ్ ఒక విద్యార్థి సంఘం కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు ల‌క్నో ఎయిర్ పోర్టుకు వెళ్ల‌గా ఆయ‌న్ను అడ్డుకున్నారు. అల‌హాబాద్ వ‌ర్సిటీలో ఒక విద్యార్థి సంఘం నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి అఖిలేశ్ వెళ్లాల్సి ఉంది. అయితే.. యూపీ పోలీసులు ఆయ‌న్ను ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్నారు.

ఈ నేప‌థ్యంలో యూపీ సీఎం ఆదిన్య‌నాథ్ స‌ర్కార్ పై అఖిలేశ్ మండిప‌డ్డారు. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్న అఖిలేశ్‌.. త‌న‌ను ఎయిర్ పోర్ట్ లో అడ్డుకుంటున్న వైనాన్ని పోటోల‌తో చెప్పారు. ఒక విద్యార్థి సంఘం నాయ‌కుడి ప్ర‌మాణ‌స్వీకార వేడుక‌ల‌కు త‌న‌ను వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకోవ‌టం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న‌ను చూసి ఎంత‌గా భ‌య‌ప‌డుతుందో తాజా ప‌రిణామం చూస్తే తెలుస్తుంద‌న్నారు. దేశంలోని యువ‌త ఇలాంటి ఘ‌ట‌న‌ల్ని స‌హించ‌ర‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండ‌గా.. ఎయిర్ పోర్ట్ లో అఖిలేశ్ ను అడ్డుకోవ‌టంపై ఎయిర్ పోర్ట్ అధారిటీని మీడియా ప్ర‌శ్నించ‌గా.. త‌న వ‌ద్ద ఎలాంటి స‌మాచారం లేద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. ఈ త‌ర‌హా ప‌రిణామాలు అంత‌కంత‌కూ పెరుగుతున్న‌ట్లుగా చెబుతున్నారు.