Begin typing your search above and press return to search.

జయలలిత బాటలో అఖిలేశ్

By:  Tupaki Desk   |   22 Jan 2017 7:35 AM GMT
జయలలిత బాటలో అఖిలేశ్
X
ఉత్తరప్రదేశ్ ప్రజలపై సమాజ్ వాదీ అధ్యక్షుడు - ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వరాల జల్లు కురిపించారు. ఉచిత హామీలతో తమిళనాడు దివంగత సీఎం జయలలితను తలపించారు. ముఖ్యంగా ఆయన ట్రెండుకు తగిన హామీలు ఇవ్వడంతో అవి ఓట్లను కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరిన తరువాత అఖిలేశ్ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. 'సమాజ్ వాదీ స్మార్ట్ ఫోన్ యోజన' పథకం కింద 1.40 కోట్ల స్మార్ట్ ఫోన్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. పేద మహిళలకు కుక్కర్లు అందిస్తామని, వారికి నెలకు రూ. 1000 పింఛన్ ఇస్తామని వాగ్దానం చేశారు. రైతుల అన్ని అవసరాలనూ తీర్చేందుకు డబ్బిస్తామని చెప్పారు. పాత మ్యానిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలతో పాటు కొత్త హామీలనూ అమలు చేస్తామని, ప్రతి గ్రామంలో ల్యాప్ టాప్ అందుబాటులో ఉంచిన ఘనత తమదేనని చెప్పుకొచ్చారు.

కాన్పూర్ - ఆగ్రాలో మెట్రో రైల్ ను నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని ఎయిర్ పోర్టులను నిర్మిస్తామని, మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరింత క్వాలిటీతో కూడిన విద్యను అందిస్తామని, అన్ని రహదారులనూ నాలుగు లైన్లుగా విస్తరిస్తామని అఖిలేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకునే ప్రతి చిన్నారికీ నెలకు లీటరు నెయ్యి - కేజీ పాల పొడిని అందిస్తామని అన్నారు. కాగా మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమానికి అఖిలేష్ భార్య కూడా హాజరు కాగా.. ములాయం సింగ్ యాదవ్ - శివపాల్ యాదవ్ వేదికపై కనిపించ లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/