Begin typing your search above and press return to search.

ఇప్పుడు బుక్ చేసుకుంటే గెలిచాక స్మార్ట్ ఫోన్ !

By:  Tupaki Desk   |   11 Oct 2016 7:34 AM GMT
ఇప్పుడు బుక్ చేసుకుంటే గెలిచాక స్మార్ట్ ఫోన్ !
X
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ఈ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు భారీగా శ్రమిస్తున్నాయి. ఏం చేసైనా సరే.. పవర్ ని మాత్రం చేజిక్కించుకోవాలన్న కసితో ఉన్నాయి. ఎన్నికలకు నెలల వ్యవధి ఉన్నా.. అందరి కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ప్రచార బరిలోకి దిగేసింది. ఆ పార్టీ అధినేత్రి నుంచి.. యువరాజు వరకూ యూపీ ఎన్నికల మీద ఎంత ప్రత్యేక దృష్టి పెడుతున్నారన్నది వారి ప్రచారం తీరు చూస్తేనే అర్థమవుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని విస్తృతంగా చేయటం ద్వారా పవర్ చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంటే.. అధికార సమాజ్ వాదీ పార్టీ మాత్రం ఆకర్షక తాయిలం ద్వారా విజయాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ల్యాప్ టాప్ నినాదంతో యూత్ ను ఆకర్షించిన సమాజ్ వాదీ.. ఈసారి ప్రజలంతా కనెక్ట్ అయ్యే ఒక కొత్త కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకొచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా స్టార్ట్ చేసిన అఖిలేష్ సర్కారు ఉచిత సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పదో తరగతి చదివి.. 18 సంవత్సరాల వయసు నిండి.. రూ.6లక్షల వార్షికాదాయం ఉన్న వారంతా ఆన్ లైన్ ద్వారా ఉచిత స్మార్ట్ ఫోన్ కోసం అప్లై చేసుకోవచ్చని చెబుతున్నారు అఖిలేశ్. నెల రోజులపాటు సాగే ఈ ఉచిత సెల్ ఫోన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో కీలకమైన అంశం ఒకటి దాగి ఉంది. అదేమంటే.. ప్రస్తుతం ఉచిత సెల్ ఫోన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. వీటి పంపిణీ మాత్రం అసెంబ్లీఎన్నికల తర్వాత తమ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఉచిత సెల్ ఫోన్ ను పంపిణీ చేస్తామని చెబుతున్నారు యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్. మరి.. ఈ ఫ్రీ స్మార్ట్ ఫోన్ పథకం యూపీ ఓటర్లను ఎంతమేర ప్రభావితం చేస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/