Begin typing your search above and press return to search.

‘‘సైకిల్’’ తండ్రికి కాదు.. కొడుకుదే

By:  Tupaki Desk   |   16 Jan 2017 3:37 PM GMT
‘‘సైకిల్’’ తండ్రికి కాదు.. కొడుకుదే
X
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన పార్టీ గుర్తు ‘సైకిల్’ను తండ్రికొడుకుల్లో ఎవరికి కేటాయించాలన్న అంశంపై స్పష్టతను ఇచ్చేసింది. యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి షురూ కానున్న నేపథ్యంలో.. అధికారపార్టీకి చెందిన సైకిల్ గుర్తు తండ్రి కొడుకుల్లో ఎవరికి చెందాలన్న అంశాన్ని తేల్చేసింది. సైకిల్ అఖిలేశ్ వర్గానికి చెందుతుందని వెల్లడించి తండ్రి ములాయంకు షాకిచ్చింది.

సమాజ్ వాదీలో 50 శాతానికి పైనే పదాధికారులు అఖిలేశ్ వైపు ఉన్న నేపథ్యంలో.. పార్టీ గుర్తును వారి వర్గానికి కేటాయిస్తున్నట్లు పేర్కొంది. కుటుంబంలో ఏర్పడిన చీలకలతో తండ్రి కొడుకుల మధ్య మొదలైన అంతర్గత పోరు అంతకంతకూ తీవ్రం కావటమేకాదు.. పార్టీలో చీలిక వరకూ వెళ్లింది. మొదట్లో కాస్తంత దూకుడుగా వ్యవహరించిన ములాయం.. తర్వాత తన అసలు బలాన్ని తెలుసుకొని వెనక్కి తగ్గే ప్రయత్నం చేసినా.. ఆయన వ్యూహం ఫలించలేదు. కొడుకు పట్టుదలను ఓకే చేయలేక.. పార్టీ గుర్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నిర్ణయంతో ములాయంకు భారీ పరాభవం ఎదురైనట్లేనని చెప్పక తప్పదు.

సైకిల్ గుర్తు లేకుండా ములాయం వర్గం ఎన్నికల బరిలోకి దిగినా.. ఫలితం పెద్దగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. సోమవారం సమాజ్ వాదీ పార్టీకి సంబంధించిన పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమాజ్ వాదీ చీఫ్ గా వ్యవహరిస్తున్న ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. తాను ఇప్పటికి మూడుసార్లు పిలిచానని.. తనవద్దకు వచ్చి కేవలం ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉండకుండా వెళ్లిపోయినట్లు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పై తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేశారు. అంతేకాదు.. కొడుకు మీద ములాయం సంచలన వ్యాఖ్య ఒకటి చేశారు. తాను పార్టీని.. సైకిల్ గుర్తును కాపాడుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తానని.. అయినప్పటికీ అఖిలేశ్ తన మాట వినిపించుకోకుంటే ఎన్నికల్లో అఖిలేశ్ మీద తాను పోటీకి దిగుతానని వ్యాఖ్యానించారు.

తాను అతడికి నచ్చజెప్పటానికి ఎంత ప్రయత్నిస్తున్నా అతడు వినటం లేదని.. అతను విపక్షాలు బీజేపీ.. ఇతరులతో చేతులు కలపటానికి ప్రయత్నిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. తన మాట కానీ వినకపోతే తన కొడుకు మీద పోటీకి దిగి.. ప్రజల్ని తీర్పు కోరుతానని ములాయం వెల్లడించారు.

మరోవైపు.. యూపీ రాజధాని లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో అనుకోని పరిణామం చోటు చేసుకుంది. పార్టీ జాతీయఅధ్యక్షుడైన ములాయం సింగ్ యాదవ్ పేరున్న బోర్డు కింద.. అఖిలేశ్ యాదవ్ ను జాతీయ అధ్యక్షుడిగా పేర్కొంటూ మరో బోర్డును ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో ములాయం పేరిట ఉన్న బోర్డు తీసేయాల్సి ఉంటుంది. ఇంకోవైపు ములాయంకు సన్నిహితుడైన అమర్ సింగ్ కీలకమైన ఎన్నికల సమయంలో దేశం వదిలి లండన్ కు వెళ్లిపోతుండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/