Begin typing your search above and press return to search.

అఖిలేశ్ జాతకం చెబుతున్నదేమిటంటే..

By:  Tupaki Desk   |   5 Jan 2017 2:10 PM GMT
అఖిలేశ్ జాతకం చెబుతున్నదేమిటంటే..
X
రాజకీయాలకు నమ్మకాలకు మధ్యనున్న అనుబంధం అంతాఇంతా కాదన్న సంగతి తెలుగు ప్రజలకు తెలిసినంత బాగా మరొకరికి తెలీదు. ఒకరికి మించి ఒకరన్నట్లుగా తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్న చంద్రుళ్లు ఇద్దరు నమ్మకాల పేరుతో చేసే పనులు అందరికి తెలిసిందే. ఒక ముఖ్యమంత్రి తాను ఉండే నివాసం తాను నమ్మిన వాస్తుకు తగ్గట్లుగా లేదన్న పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టి.. రాజప్రసాదం లాంటి భవనాన్ని కట్టించేస్తే.. మరో ముఖ్యమంత్రి.. వాస్తు పేరుతో.. నమ్మకాల పేరుతో నివాసానికి పెట్టిన ఖర్చు తడిచి మోపెడు అయ్యిందని చెప్పాలి.

తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ఖర్చు ఆస్తి రూపంలో అయినా మిగిలితే.. చంద్రబాబు పెట్టిన కోట్లాది రూపాయిల ఖర్చు బూడిదలో పోసిన చందంగా మారింది. వాస్తు కోసం ఆయన హైదరాబాద్ లోని నివాసం.. సీఎం పేషీ కోసం పెట్టిన ఖర్చు మొత్తంవృధాఅయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తండ్రితో పేచీ పడి.. పార్టీ పగ్గాల్ని తన చేతిలోకి తీసుకొని వెళ్లాలని భావిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

మరో నెల వ్యవధిలో ఎన్నికల జరుగుతున్న వేళ.. యూపీ అధికారపక్షంలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో.. ముఖ్యమంత్రి అఖిలేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సమయంలో ఆయన జాతకానికి సంబంధించిన కుండలి ఒకటి బయటకు వచ్చింది. అఖిలేశ్ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పండితులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటివరకూ అఖిలేశ్ వేసిన ఎత్తులన్నీ సక్సెస్ అయినప్పటికీ.. ఇప్పటి నుంచి వేసే అడుగులు మాత్రం చాలా జాగ్రత్తగా పడాలని సూచిస్తున్నారు.

ఆయన జాతకం ప్రకారం.. చాలా జాగ్రత్తగా ఉంటే తప్పించి విజయవంతంగా నెగ్గుకు రాలేదన్న వాదనను పండితులు వినిపిస్తున్నారు. అఖిలేశ్ కుండలిని ప్రకారం.. ఆయన ఉత్తరప్రదేశ్ లోని ఎటావా జిల్లాలోని సైపై గ్రామంలో 1973 జులై ఒకటో తేదీన జన్మించారు. ఆయన అదృష్ట సంఖ్య ఒకటిగా చెబుతున్నారు. 2017లో అంకెల్ని కలిపితే వచ్చే సంఖ్య ఒకటి కావటం గమనార్హం. అదృష్ట సంఖ్య ప్రకారం చూస్తే.. ఈ ఏడాది అఖిలేశ్ కు కలిసి రావాలని చెబుతున్నారు.

కన్యా లగ్నం మిథున రాశిలో పుట్టిన అఖిలేశ్ కు ప్రస్తుతం బుధ మహర్దశలో శని అంతర్దశ నడుస్తోంది. మార్చి 22తో ఇది ముగియనుంది. ప్రస్తుతం బుధుడు 11వ ఇంట ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. గురుడు బుధుడ్ని చూస్తుండటంతో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఆయనకు ఉందని చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన కానీ నిలవాలంటే ఆచితూచినిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో తెలిసిన వేళ..అఖిలేశ్ అన్సర్ ఎలా ఉంటాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/