Begin typing your search above and press return to search.

‘‘సైకిల్’’ గుర్తు ఎవరి వశం..?

By:  Tupaki Desk   |   2 Jan 2017 7:29 AM GMT
‘‘సైకిల్’’ గుర్తు ఎవరి వశం..?
X
రీల్ లైఫ్ లో కానీ.. రియల్ లైఫ్ లోని కానీ.. అత్యున్నత స్థానాల్లో ఉన్న చాలామంది నాన్నతో ప్రేమతో.. అంటూ రాగాలు తీయటం తెలుసు. కానీ.. నాన్నకు షాకిస్తూ అన్నది మాత్రం లేదు. అలాంటి చిత్రమైన రాజకీయ దృశ్యంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు అంతకంతకు పెరిగిపోయి.. చివరకు ‘‘నేతాజీ’’గా ఎంతో గౌరవ.. మర్యాదలతో పిలుచుకునే ములాయంకు షాకిచ్చేందుకు ఆయన కుమారుడు అఖిలేశ్ సిద్ధమయ్యారు.

ఒకరి మీద మరొకరు పోటాపోటీ ప్రకటనల ఇచ్చుకుంటున్న ఈ వ్యవహారంతో సమాజ్ వాదీ పార్టీ తీవ్ర సంక్షోభానికి గురైనట్లుగా కనిపిస్తోంది. మరి.. ఇది ఎంతవరకు వెళుతుంది? పార్టీకి చెందిన సైకిల్ గుర్తు ఎవరి వశం కానుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది. పార్టీ చీఫ్ గా ఇంతకాలం వ్యవహరించిన ములాయంను.. పార్టీ మెంటార్ గా వ్యవహరిస్తారని ములాయం కొడుకు అఖిలేశ్ వెల్లడించటం.. తాను ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోని వారే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వాదనను ములాయం చేస్తున్నారు.

ఇలా.. ఒకరి మీద మరొకరు పోటాపోటీగా చేసుకుంటున్న ప్రకటనలు యూపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సాగుతున్న రచ్చ.. పార్టీ నిట్టనిలువునా చీలిపోవటంఖాయమన్న మాట పలువురు చెబుతున్నారు. ఒకవేళ వేళ అదే జరిగితే.. పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘‘సైకిల్’’ ఎవరి వశం అవుతుందన్నది సస్పెన్స్ గా మారింది.

సమాజ్ వాద్ పార్టీకి సంబంధించి సర్వ హక్కులు తమవంటే.. తమవంటూ ఒకరిపై ఒకరు పోటాపోటీగా ప్రకటనలు చేసుకుంటున్న నేపథ్యంలో.. సమాజ్ వాదీపార్టీ ఎన్నికల చిహ్నమైన సైకిల్ ఇద్దరికి కాకుండా పోతుందన్న వాదన వినిపిస్తోంది. ములాయం.. అఖిలేశ్ వర్గాలు కానీ ఘర్షణ పడిన పక్షంలో ఎన్నికల సంఘం.. ఆ పార్టీ గుర్తును స్తంభింపచేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

అలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండటం కోసం.. పార్టీకి తానే జాతీయఅధ్యక్షుడిని అని చెప్పుకోవటం.. అందుకు తగ్గట్లు పార్టీ జాతీయ సదస్సును ఆదివారం నిర్వహించటానికి కూడా కారణం.. ‘సైకిల్’ గుర్తును సొంతం చేసుకోవటానికేనని చెబుతున్నారు. తండ్రి.. కొడుకుల వర్గాల్లో ఎవరికి వారు తమదే అసలైన సమాజ్ వాదీ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి. సాంకేతికంగా చూస్తే.. ఈ వ్యవహారంలో ములాయం సేఫ్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఎన్నికల సంఘం రికార్డులో ములాయం.. ఇతర ఆఫీసు బేరర్ల పేర్లు మాత్రమే ఉన్నాయని మర్చిపోకూడదు.

ఈ విషయాన్ని గుర్తించిన అఖిలేశ్.. సైకిల్ గుర్తును సొంతం చేసుకోవటానికి వీలుగా.. అసలైన సమాజ్ వాదీ పార్టీ తనదేనని చెప్పుకుంటున్నారని.. ఆ విషయాన్ని అధికారికంగా ఈసీకి తెలియజెప్పేందుకు వీలుగా.. జాతీయసదస్సును నిర్వహించి.. పార్టీ చీఫ్ గా తనను ప్రకటించటం కోవటం ద్వారా.. పార్టీ గుర్తును తన సొంతం చేసుకోవటానికి అఖిలేశ్ పావులు కదుపుతున్నారని చెప్పకతప్పదు.

మరి.. అఖిలేశ్ విన్నపంపై ఈసీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అఖిలేశ్ వాదనపై ములాయం అభిప్రాయాన్ని కానీ ఈసీ కోరితే.. సైకిల్ గుర్తు తన సొంతమని ఆయన చెప్పే వీలుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైన వేళ.. ఒక నిర్ణయానికి రాని పక్షంలో ఈసీ.. అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి.. కుమారులిద్దరికి సైకిల్ గుర్తును కేటాయించకపోయే అవకాశం ఉందన్న వాదనా వినిపిస్తోంది. మరి.. ఎన్నికల వేళ కీలకమైన పార్టీ గుర్తుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/