Begin typing your search above and press return to search.

కోర్టు తీర్పుతో రోడ్డుపై క్రికెట్ ఆడుతున్న మాజీ సీఎం

By:  Tupaki Desk   |   3 Jun 2018 5:16 PM GMT
కోర్టు తీర్పుతో రోడ్డుపై క్రికెట్ ఆడుతున్న మాజీ సీఎం
X
సుప్రీంకోర్టు ఆదేశాలు యూపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లానికి కార‌ణంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంలు శనివారం తమ అధికార భవంతులను ఖాళీ చేయాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. యూపీ మాజీ సీఎంలందరూ ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాలని గత నెల 7వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తమకు లక్నో ఇళ్లు లేవని * ఖాళీ చేయడానికి రెండేళ్ల సమయం కావాలని అఖిలేష్ - ములాయం కోరారు. మాయావతి అయితే తన బంగ్లాను కాన్షీరామ్ మెమోరియల్‌ గా మార్చేశారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లంతా బంగ్లాలు ఖాళీ చేశారు. ఈ నేప‌థ్యంలో మాజీ సీఎం ములాయంసింగ్ - అఖిలేశ్ అధికారిక భవనాలను విడిచిపెట్టారు. తన భర్త తీవ్ర అనారోగ్యంతో - జీవిత చరమాంకంలో ఉన్నందున తనకు కొంత గడువు ఇవ్వాలని ఎన్డీ తివారీ భార్య ఉజ్వల విజ్ఞప్తి చేశారు. బీఎస్‌ పీ అధినేత్రి - యూపీ మాజీ సీఎం మాయావతి ప్రభుత్వ బంగళాను ఖాళీ చేశారు. దాన్ని కాన్షీరాం స్మారక చిహ్నంగా కొనసాగించాలని నొక్కి చెప్పారు.

అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన అధికారిక బంగ్లా ఖాళీ చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ప‌రిణామంపై ప‌రోక్ష నిర‌స‌న తెలిపారు. అయితే ఇన్నాళ్లూ నాలుగు గోడలకే పరిమితమైన ఆయన బంగ్లా నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజల మధ్య గడిపారు. శనివారం రాత్రి వీవీఐపీ గెస్ట్ హౌజ్‌ లో గడిపిన అఖిలేష్.. ఉదయాన్నే సైకిల్ తొక్కుతూ గోమ్టి నది తీరానికి వెళ్లి అక్కడ మార్నింగ్ వాక్‌ కు వచ్చిన వారితో మాట్లాడారు. వాళ్లతో సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత అక్కడే కొందరు యువకులు క్రికెట్ ఆడుతుండటంతో వాళ్ల దగ్గరికి వెళ్లి తానూ కాసేపు బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడారు. గోమ్టి రివర్ ఫ్రంట్‌ ను సమాజ్‌ వాదీ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. తమ ప్రభుత్వ ప్రాజెక్టులన్నింటిపై తాను ఓ కన్నేసి ఉంచుతానని ఈ సందర్భంగా అఖిలేష్ అన్నారు. శనివారం సాయంత్రం కూడా జనేశ్వర్ మిశ్రా పార్క్‌కు వెళ్లి కాసేపు గడిపారు.