Begin typing your search above and press return to search.

దాద్రీలో అదేం జ‌ర‌గ‌లేద‌ట‌

By:  Tupaki Desk   |   28 Dec 2015 4:29 PM GMT
దాద్రీలో అదేం జ‌ర‌గ‌లేద‌ట‌
X
దాద్రీ.... ఈ గ్రామం పేరు కొత్త‌గా ప‌రిచ‌యం చేయ‌క్క‌ర్లేదు. ఉత్త‌ర్‌ ప్ర‌దేశ్‌ లోని ఈ గ్రామం కొద్దికాలం క్రితం అక‌స్మాత్తుగా తెర‌మీద‌కు వ‌చ్చింది. బీఫ్ భుజించాడన్న వదంతులు వ్యాపించిన నేపథ్యంలో దాద్రిలో అఖ్ లక్ అనే వ్యక్తిని కొందరు కొట్టి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారి న‌రేంద్ర‌మోడీ స‌ర్కారుకు పెద్ద త‌ల‌నొప్పిగా త‌యారైంది. బీహార్ ఎన్నిక‌ల ముందు అస‌హ‌నం పేరుతో జ‌రిగిన ర‌చ్చ‌కు కార‌ణంగా మారింది. అయితే దాద్రీ ఘ‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర‌మైన రిపోర్ట్ ఇపుడు తెర‌మీద‌కు వ‌చ్చింది.

దాద్రి ఘటన వ్యవహారంలో బాధితుడి ఇంటిలో లభించింది మటనే కానీ బీఫ్ కాదని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. దాద్రీ సంఘటనకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ వెటర్నటీ చీఫ్ ఆఫీసర్ ఈ రోజు వెల్లడించిన నివేదికలో అఖ్‌ లక్ ఇంట్లోని రిఫ్రిజిరేటర్ లో ఉన్న మాంసం మటనే కానీ బీఫ్ కాదని స్పష్టం చేసింది. దీంతో దాద్రీ ఘ‌ట‌న‌పై కొత్త అనుమానాలు, అభిప్రాయాలు త‌లెత్తాయి. మ‌త‌ఘ‌ర్ష‌ణ‌ల వ‌ల్ల దాద్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంది.

ఇదిలాఉండ‌గా...ఇదే త‌ర‌హాలో మ‌త విద్వేషాల‌కు సంబంధించి తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన అప్‌ డేట్ ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. క‌ర్ణాటక పోలీసులు ఇద్దరు ప్రముఖుల రాకపై నిషేధం విధించారు. వీహెచ్‌ పీ నేత ప్రవీణ్‌ తొగాడియా, ఇస్లామిక్‌ స్కాలర్‌ డాక్టర్‌ జకీర్‌ నాయిక్‌ లను మంగళూరులోకి ప్రవేశించకుండా కర్ణాటక పోలీసులు నిషేధం విధించారు. మంగళూరులో మత ఉద్రిక్తతలు చెలరేగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఈ నేతలిద్దరూ వస్తే మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాలున్నందున వారి రాకపై నిషేధం విధించారు. సౌత్‌ కర్ణాటక సలాఫీ మూవ్‌ మెంట్‌ కార్యక్రమంలో ప్రధానోపన్యాసం చేయడానికి డాక్టర్‌ నాయిక్‌ జనవరి 3వ తేదీన మంగళూరు రానున్నారు. గోవధ - లవ్‌ జిహాదీ - హిందువులపై దాడులు తదితర అంశాలపై చర్చించే నిమిత్తం తొగాడియా రానున్నారు. కాగా, మంగళూరులో ప్రస్తుతం 144 సెక్షన్‌ అమలులో ఉంది.