Begin typing your search above and press return to search.

హరీశ్ అడిగాడు.. అఖిల్ వచ్చేశాడు.. ఇద్దరు క్రికెట్ ఆడారు

By:  Tupaki Desk   |   18 Feb 2022 5:45 AM GMT
హరీశ్ అడిగాడు.. అఖిల్ వచ్చేశాడు.. ఇద్దరు క్రికెట్ ఆడారు
X
చెట్టాపట్టాలు వేసుకున్న సోదరుల మాదిరి రాజకీయం.. సినిమా పరిశ్రమ ఉంటుంది. ఒకరి అవసరాన్ని మరొకరు తీరుస్తుంటారు. అప్పుడప్పుడు లెక్కలు తేడా వచ్చినప్పుడు మాత్రం తామేమిటో చూపిస్తుంటారు.

అదే సమయంలో అవసరం కోసం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేళ.. మిగిలిన వారికి భిన్నంగా ప్లాన్ చేశారు మంత్రి హరీశ్ రావు. పేరుకు రాష్ట్ర మంత్రి అయినా తాను ప్రాతినిధ్యం వహించే సిద్ధిపేటకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

తాను నిర్వహించే భారీ కార్యక్రమాల్ని సిద్ధిపేటలో జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటారు మంత్రి హరీశ్ రావు. తాజాగా 4వేల మంది క్రీడాకారులతో 258 జట్లతో సీఎం కేసీఆర్ ట్రోఫీని గురువారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిధిగా.. యువ నటుడు అఖిల్ అక్కినేనిని పిలిచారు.

ఆయన రాకతో ఈ కార్యక్రమానికి గ్లామర్ కళ వచ్చేసింది. ఇప్పటికే సిద్ధిపేటను క్రీడలకు.. విద్యకు హబ్ గా మార్చిన హరీశ్ రావు.. అదెంత అన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా తాజా సీఎం కేసీఆర్ ట్రోఫీని నిర్వహిస్తున్నారు.

టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా మంత్రి హరీశ్ బ్యాటింగ్ చేస్తే.. అఖిల్ ఆయనకు బౌలింగ్ వేశారు. సినిమాల్లోకి రాకముందు.. అఖిల్ క్రికెట్ కోసం విదేశాలకు వెళ్లి మరీ శిక్షణ పొంది రావటం తెలిసిందే.

మంత్రి హరీశ్ సైతం తరచూ క్రికెట్ ఆడటం.. పలు మ్యాచుల్లో ఆయన ఆడిన ఆట అందరిని ఆకర్షించేలా ఉండటం తెలిసిందే. మొత్తానికి ఒక భిన్నమైన కాంబినేషన్.. సీఎం కేసీఆర్ పుణ్యమా అని సిద్ధిపేటలో ఆవిష్కృతమైంది.