Begin typing your search above and press return to search.

జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే..

By:  Tupaki Desk   |   10 Jan 2019 6:27 AM GMT
జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే..
X
పవన్ కళ్యాన్ బీజేపీని టార్గెట్ చేశారు. అందులోని అసంతృప్తులను జనసేనలోకి లాగే పనిని మొదలుపెట్టారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష బీజేపీ నుంచి ఎవ్వరూ వచ్చే పరిస్థితులు లేకపోవడంతో బీజేపీలో ఉన్న సీనియర్ నేతలకు పవన్ కళ్యాణ్ గాలం వేస్తున్నారు. తాజాగా ఆయన గాలానికి బీజేపీ రాజమండ్రి అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చిక్కారు.

ఇటీవలే అమిత్ షాను కలిసి బీజేపీకి రాజీనామా చేసినట్టు ఆకుల సత్యనారాయణ గురించి వార్తలొచ్చాయి. దాన్ని ఆయన ఢిల్లీలో ఖండించారు. తాజాగా రాజమండ్రిలో ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ.. తనను పవన్ కళ్యాణ్ జనసేనలోకి ఆహ్వానించారని.. త్వరలోనే చేరబోతున్నట్టు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే బీజేపీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత జనసేనలోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈనెల21న పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టు ఆయన తెలిపారు.

తాను పార్టీ మారడానికి బీజేపీయే కారణమని ఎమ్మెల్యే ఆకుల మండిపడ్డారు. ఏపీకి బీజేపీ అన్నిరంగాల్లో మోసం చేసిందని.. నిధులు, విధుల్లో వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. 2019 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరుతున్నానని.. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే టికెట్ లేదా.. అవసరమైతే రాజమండ్రి ఎంపీ సీటుపై కూడా పోటీచేస్తానని ఆకుల సత్యనారాయణ వివరించారు.

ఇక ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీని ఎంచుకోవడం వెనుక కుల సమీకరణాలే ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువ. బీజేపీ ఏపీలో హోదా విషయంలో యూటర్న్ తీసుకొని దాదాపు కనుమరుగైంది. దీంతో పెద్దగా బలం లేని బీజేపీ నుంచి కంటే కాపుల సపోర్ట్ ఫుల్ గా ఉన్న జనసేన నుంచి పోటీచేస్తేనే గెలుస్తామని ఆకుల భావిస్తున్నారు. స్వతహాగా అదే సామాజికవర్గమైన ఆకుల అందుకే జనసేనను ఎంచుకున్నట్టు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలుండడంతో అందులో భాగస్వామ్యం కావాలనే జనసేనలో ఆకుల చేరబోతున్నట్టు తెలిసింది. జనసేనాని కూడా సామాజిక కుల కోణంలోనే ఆకులను చేర్చుకుంటున్నట్టు సమాచారం.