Begin typing your search above and press return to search.

మిత్రపక్షంపై దాడికి అందరూ ఒక్కటయ్యారు

By:  Tupaki Desk   |   29 Oct 2015 11:07 AM GMT
మిత్రపక్షంపై దాడికి అందరూ ఒక్కటయ్యారు
X
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు మిత్రులవుతారో... ఎప్పుడు ఎవరు శత్రువులు అవుతారో చెప్పలేం. ఆ సంగతెలా ఉన్నా ఇప్పుడు ఏపీలో ఇంకో విచిత్రం కూడా కనిపిస్తోంది. మిత్రపక్షంపైనే దాడి చేయడం కోసం శత్రువులు మిత్రులవుతున్నారు. అవును... ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతలు టీడీపీపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలో నిన్నమొన్నటి వరకు అంటీముట్టనట్లుగా ఉన్న నేతలు కూడా ఒకరికొకరు అండగా ఉంటూ కలిసికట్లుగా టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారు.

ప్రత్యేక హోదా, కేంద్ర పథకాల నేపథ్యంలో టీడీపీ - బీజేపీల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీ నేతలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే.... ఆయన వ్యవహారం శ్రుతి మించడంతో టీడీపీ నేతలూ మండిపడుతున్నారు. టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ సోము వీర్రాజుపై ఎదురుదాడి చేశారు. అయితే... సోము వీర్రాజుకు అనూహ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ నుంచి మద్దతు దొరికింది. నీతి నిజాయితీల గురించి టీడీపీ నేతలతో చెప్పించుకునే అవసరం బీజేపీకి లేదని... తమ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురించి తెలియక రాజేంద్రప్రసాద్ నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని అన్నారు.

టీడీపీ నేతల హితబోధలు తమకు అవసరం లేదని.. ప్రత్యేక హోదా విషయంలో వాస్తవాలను ప్రజలుకు వివరించాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదేనని అంటూ నీతి నిజాయితీ గురించి టీడీపీకి తమకు చెప్పే స్థాయి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా మొన్నమొన్నటి వరకు తూర్పుగోదావరి బీజేపీలో రెండు వర్గాలుగా ఉన్న వీర్రాజు, సత్యనారాయణలు ఇప్పుడు ఇలా ఒకరికోసం ఒకరు మద్దతుగా ఉంటూ టీడీపీపై విరుచుకుపడుతున్నారు.