Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ కేసులో డిసెంబ‌ర్‌ లో అస‌లు ట్విస్ట్‌!

By:  Tupaki Desk   |   18 Aug 2017 9:30 AM GMT
డ్ర‌గ్స్ కేసులో డిసెంబ‌ర్‌ లో అస‌లు ట్విస్ట్‌!
X
టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపిన‌ డ్ర‌గ్స్ ఎపిసోడ్‌ లో సిట్ ద‌ర్యాప్తు జ‌ర‌ప‌డం అంద‌రి చూపును హైద‌రాబాద్ వైపు ప‌డేలా చేసిన‌ సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ హీరోలు మొద‌లుకొని పాపుల‌ర్ న‌టీమ‌ణుల వ‌ర‌కు ప‌లువురిని ద‌ర్యాప్తు అధికారులు విచార‌ణ చేయ‌డంతో ఈ మ‌హ‌మ్మారి ఎపిసోడ్ ఏ మ‌లుపు తిరుగుతుందో అని ఉత్కంఠ నెల‌కొంది. అయితే విచార‌ణ ముగిసిన త‌ర్వాత సిట్ ద‌ర్యాప్తుకు అడ్ర‌స్ లేకుండా పోయింది. అస‌లేం జ‌రుగుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై ప‌లు విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

అయితే ఈ అపోహ‌ల‌కు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ క్లారిటీ ఇచ్చారు. డ్రగ్స్ కేసు విచారణ చురుగ్గా కొనసాగుతుందని ఆయ‌న తేల్చిచెప్పారు. డిసెంబర్ చివరి నాటికి కోర్టులో ఛార్జీషీట్లు దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు - న్యాయనిపుణులతో చర్చించి ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. అమీర్ పేటలో నిర్వహించిన సీబీఎస్ ఈ ప్రిన్సిపల్స్ కాన్ క్లేవ్ లో పాల్గొన్న సందర్భంగా అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. సిట్ ఇప్పటి వరకు 11 కేసుల్లో 22 మందిని అరెస్టు చేసిందని చెప్పారు. సాక్షుల విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. సినీ ప్రముఖులు సాక్షులా? నిందితులా? అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. సినీ ప్రముఖుల విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నామన్న అకున్ స‌బ‌ర్వాల్‌ సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు.

సామాజిక బాధ్యతతో డ్రగ్స్ దుష్పరిమాణాలను చెబుతున్నామని అకున్ స‌బ‌ర్వాల్ చెప్పారు. డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థలు స్పందిస్తున్నాయని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయులు గమనించాలని సూచించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు విద్యార్థులెవరికీ నోటీసులు ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. పబ్ లు - పాఠశాలలు - విద్యార్థుల పేర్లు వెల్లడించలేదని పేర్కొన్నారు. త్వరలో డ్రగ్స్ వెబ్ సైట్ల నియంత్రణపై ఉన్నత స్థాయి భేటీ నిర్వహిస్తామని చెప్పారు.