Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో మలుపు.. ఆ అధికారి బదిలీ?

By:  Tupaki Desk   |   14 July 2017 10:39 AM GMT
డ్రగ్స్ కేసులో మలుపు.. ఆ అధికారి బదిలీ?
X
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో ప్రధాన చర్చనీయాంశం.. డ్రగ్స్ కేసే. ఈ కేసులో కొందరు ప్రముఖులకు వ్యతిరేకంగా ఆధారాలు దొరకడం.. వారికి నోటీసులు వెళ్లడం.. ఆ నోటీసులందుకున్న వాళ్ల పేర్లు బయటికి రావడం సంచలనం రేపుతోంది. మామూలుగా అయితే ఇలాంటి వ్యవహారాల్ని గుట్టు చప్పుడు కాకుండా కప్పెట్టేస్తారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ల పేర్లు బయటికి రావు. కానీ ఆశ్చర్యకరంగా ఇవాళ డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న ప్రముఖుల పేర్లన్నీ బయటికి వచ్చేశాయి. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఒకరకమైన కుదుపునకు లోనైంది. ఉదయం నుంచి ఈ వ్యవహారం కలకలం రేపుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం
.
స్కూలు పిల్లల్ని కూడా డ్రగ్స్ బానిసలుగా మార్చేస్తున్న ఈ డ్రగ్ మాఫియాకు కళ్లెం వేయాలన్న పట్టుదలతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ అకున్ సబర్వాల్.. కఠిన చర్యలకు దిగారు. ఇండస్ట్రీ ప్రముఖుల బాగోతాల్ని బయటపెట్టాలని భావించి.. వాళ్ల పేర్లు లీక్ చేశారు. ఐతే ఈ పరిణామాలతో ఇరుకున పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఆయన మీద సీరియస్ అయినట్లు సమాచారం. అకున్ ఈ కేసు విషయంలో అతిగా స్పందించాడని ఉన్నతాధికారులు.. ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నారట. దీంతో ఆయన్ని అత్యవసరంగా సెలవులో వెళ్లమని ఆదేశించినట్లు వార్తలొస్తున్నాయి. డ్రగ్స్ కేసు నుంచి అకున్ సబర్వాల్ ను తప్పించి.. ఆయన్ని మరో చోటికి బదిలీ చేయొచ్చని కూడా అంటున్నారు. అదే జరిగితే డ్రగ్స్ కేసుకు సంబంధించి కఠినంగా వ్యవహరిస్తున్నందుకు ఇప్పుడు ప్రభుత్వానికి దక్కుతున్న క్రెడిట్ మొత్తం పోతుందనడంలో సందేహమే లేదు.