Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ లిస్ట్ పై అకున్ మ‌ళ్లీ మాట్లాడారు

By:  Tupaki Desk   |   30 Aug 2017 5:14 AM GMT
డ్ర‌గ్స్ లిస్ట్ పై అకున్ మ‌ళ్లీ మాట్లాడారు
X
కొన్ని వారాల పాటు రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు.. దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన డ్ర‌గ్స్ విచార‌ణ‌.. అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాలు.. తాజాగా ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యంపై ఆబ్కారీ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ మాట్లాడారు. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు.

డ్ర‌గ్స్ విచార‌ణ స్లో అయ్యింద‌న్న మాట‌లో వాస్త‌వం లేద‌ని.. దాడులు జ‌రుగుతున్నాయ‌ని.. అరెస్టులు కంటిన్యూ అవుతున్న విష‌యాన్ని వెల్ల‌డించారు. అవ‌స‌ర‌మైతే సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు మ‌రోసారి నోటీసులు ఇచ్చేందుకు వెనుకాడ‌మ‌న్న ఆయ‌న‌.. సినీప్ర‌ముఖుల విచార‌ణ త‌ర్వాత కూడా ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌న్నారు. త‌మ సిబ్బంది గ్రౌండ్ లెవ‌ల్లో ప‌ని చేస్తున్నార‌న్నారు. ద‌ర్యాప్తులో వెల్ల‌డైన ఆధారాల ఆధారంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌న్న ఆయ‌న‌.. ప్ర‌స్తుతం తాము కెల్విన్ ముఠా కేసుల్లో ఛార్జిషీట్ దాఖ‌లు చేసే విష‌యం మీద ఫోక‌స్ చేసిన‌ట్లు చెప్పారు. నిందితుల‌కు క‌చ్ఛితంగా శిక్ష ప‌డుతుంద‌న్న న‌మ్మ‌కంతో తాను ఉన్న‌ట్లు చెప్పారు.

డ్ర‌గ్స్ కు సంబంధించి త‌న‌కు ల‌భించిన చిన్న ఆధారంతో ద‌ర్యాప్తు మొద‌లు పెడితే పెద్ద ముఠానే బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. ఎల్ ఎస్ డీ స‌ర‌ఫ‌రా చేస్తున్న పెద్ద ముఠాల్లో దేశంలోనే ఇదొక‌ట‌ని చెప్పిన ఆయ‌న‌.. ఈ విష‌యాన్ని మాద‌క‌ద్ర‌వ్యాల నియంత్ర‌ణ సంస్థ అధికారులు కూడా అంగీక‌రించార‌న్నారు.

ఈ ముఠా విస్త‌రించిన తీరు చూసి తాను ఆందోళ‌న చెందాన‌ని.. డ్ర‌గ్స్ విస్తృతి ఈ స్థాయిలో ఉంటుంద‌ని తాను ఊహించ‌లేద‌న్నారు. రెండు విశ్వ‌విద్యాల‌యాల‌తో పాటు.. 13 విదేశీ సాఫ్ట్ వేర్ సంస్థ‌ల్లోనూ డ్ర‌గ్స్ వినియోగం ఉంద‌ని.. ఆ వివ‌రాల్ని ఆయా సంస్థ‌ల దృష్టికి తీసుకెళ్ల‌గా సానుకూలంగా స్పందించాయ‌ని.. నియంత్ర‌ణ‌కు స‌హ‌క‌రిస్తామ‌ని చెబుతున్నార‌న్నారు.