Begin typing your search above and press return to search.

దరిద్రం వదిలింది.. అల్ ఖైదా అల్ జవహరీ హతం!

By:  Tupaki Desk   |   2 Aug 2022 4:42 AM GMT
దరిద్రం వదిలింది.. అల్ ఖైదా అల్ జవహరీ హతం!
X
ప్రపంచానికి పట్టిన ఉగ్రచీడకు అసలుసిసలు కారకుడిగా పేర్కొనే అల్ ఖైదా ఉగ్ర నాయకుడు అల్ జవహరీ హతమయ్యారు. అగ్రరాజ్యం అమెరికా నిర్వహించిన ఆపరేషన్ లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా చెబుతున్నారు. కీలక ప్రకటనను అధ్యక్షుల వారు చేస్తా' రంటూ వైట్ హౌస్ ట్విటర్ ఖాతాలో చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వార్త రాసే సమయానికి వైట్ హౌస్ నుంచి అమెరికా అధ్యక్షుల వారి నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. అనధికారిక సమాచారంతో అమెరికా మీడియా సంస్థలు ఈ విషయాన్ని చెప్పేస్తున్నాయి.

అల్ జవహరీని మట్టుబెట్టినట్లుగా అమెరికా ప్రకటించనప్పటికీ.. దానికి బలం చేకూరేలా ట్వీట్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ''అఫ్గానిస్థాన్ లో చేపట్టిన ఒక విజయవంతమైన ఉగ్రవాద నిరోధన ఆపరేషన్ కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేస్తారు' అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా అమెరికా మీడియా సంస్థలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం కాబూల్ లోని షేర్పూర్ ప్రాంతంలోని ఒక ఇంటిపై వైమానికి దాడి జరిగినట్లుగా పేర్కొంటున్నారు. దీనికి తగ్గట్లే తాలిబన్ ప్రతినిధి చేసిన ట్వీట్ ఈ వాదనకు బలం చేకూరేలా మారింది.

షేర్పూర్ ప్రాంతంలోని ఒక ఇంటి మీద వైమానిక దాడి జరిగినట్లుగా ట్వీట్ చేశారు. ఈ దాడి అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమంటూ ఖండించటం గమనార్హం. ఈ ఆగ్రహాన్ని చూస్తే.. అల్ ఖైదా చీఫ్ ను అమెరికా హతమార్చినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఉందన్న విషయం అర్థం కాక మానదు. ఇక.. అల్ జవహారీ విషయానికి వస్తే.. ఈజిప్టు కు చెందిన ఇతను సర్జన్.

ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా అతని తల మీద భారీ బహుమానాలు ఉన్నాయి. 2001 సెప్టెంబరు 11న అమెరికాపై జరిగిన ఉగ్రదాడిలో 3 వేల మంది మరణించిన వైనం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన సూత్రధారుల్లో అల్ జవహరీ ఒకరుగా చెబుతారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడ్ని మట్టుబెట్టాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది.

ఈ ఉదంతంలో మరో కీలక భాగస్వామి అయిన ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చిన అమెరికా.. అల్ ఖైదా పగ్గాల్ని తర్వాతి కాలంలో చేపట్టిన జవహరీని తాజాగా మట్టుబెట్టింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. మొత్తానికి అమెరికా తన టార్గెట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటుందన్న విషయం తాజా ఉదంతంతో మరోసారి నిరూపితమైందని చెప్పాలి.