Begin typing your search above and press return to search.

అసమ్మతిపోరు.. తంబీల రాజకీయ హోరు..

By:  Tupaki Desk   |   6 Sept 2018 3:43 PM IST
అసమ్మతిపోరు.. తంబీల రాజకీయ హోరు..
X
దిగ్గజ నేతల మరణం ఆ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. రాజకీయాధికారం కోసం ఆ వారసుల మధ్య కొట్లాటలు మొదలయ్యాయి.. అసమ్మతి వేడితో ఇప్పుడా రాష్ట్రం అట్టుడుకుతోంది. తమిళనాట రాజకీయాలు మునుపెన్నడూ లేనంత గందరగోళంగా మారింది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు అన్నాడీఎంకే - డీఎంకేలలో అంతర్గత కుమ్ములాటలు రెండు పార్టీలకు పెద్ద చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా మారిన ఈ రాజకీయాలు వాటి భవిష్యత్ రాజకీయాలకు పెను విఘాతంగా మారాయి.

డీఎంకే పార్టీలో కరుణానిధి మరణం తర్వాత అన్నాదమ్ములు అళగిరి - స్టాలిన్ ల మధ్య ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారు. కరుణానిధి సమాధి నుంచి అళగిరి తాను అధ్యక్షుడినని ప్రయత్నాలు చేయడం.. స్టాలిన్ పార్టీ నేతల మద్దతుతో తనను తాను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం జరిగిపోయాయి. తనను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని అళగిరి పెట్టిన అభ్యర్థనను స్టాలిన్ తోసిపుచ్చడంతో ఇప్పుడు తిరుగుబాటుకు అళగిరి ప్లాన్ చేస్తున్నారు.తాజాగా ఆళగిరి చెన్నైలో చేసిన బలప్రదర్శనలో దమ్ముంటే తన మద్దతుదారుల్ని పార్టీ నుంచి బహిష్కరించండని.. తమ్ముడు స్టాలిన్ కు సవాల్ విసిరారు. కొడుకు - కూతురుతో కలిసి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించి అసమ్మతి రాజకీయాలకు తెరదీశారు.

ఇక అధికార అన్నాడీఎంకేలో ఎవరు పార్టీ లీడరో.. ఎవరు నడిపిస్తారో తెలియని పరిస్థితి. అమ్మ మరణం తర్వాత పార్టీలో నంబర్ 2గా అన్నీ తానై వ్యవహరించిన పన్నీర్ సెల్వంను శశికళ టార్గెట్ చేయడం.. పన్నీర్ ముఖ్యమంత్రి పీఠం కోల్పోవడం తెలిసిందే.., శశికళ మద్దతుతో ఫళని స్వామి సీఎం అవ్వడం.. ఆ తర్వాత పరిణామాల్లో శశికళ జైలుకు, పన్నీర్ సెల్వం-ఫళని స్వామి కలిసిపోవడం జరిగిపోయింది. ఇప్పుడు శశికళ వర్గం నుంచి ఆమె అల్లుడు అన్నాడీఎంకేపై పోరాడుతున్నారు.

ఇలా రెండు ప్రధాన రాజకీయ పార్టీల్లో అసమ్మతి సెగ రాజుకుంది. ఇక ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న కమల్ హాసన్, రజినీకాంత్ లు ఇంకా ఆ ఊపు తీసుకురావడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.? ఎవరికీ ప్రజలు ఓటేస్తారనేది ఆసక్తిగా మారింది.