Begin typing your search above and press return to search.

ఇదేదో మొద‌టే ఏడిస్తే స‌రిపోయేదిగా!

By:  Tupaki Desk   |   31 Aug 2018 6:43 AM GMT
ఇదేదో మొద‌టే ఏడిస్తే స‌రిపోయేదిగా!
X
రాజ‌కీయంగా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన‌ప్పుడు తీసుకోవాలే కానీ.. త‌ప్పు మీద త‌ప్పు చేసిన త‌ర్వాత ఎంత నాలుక క‌ర్చుకుంటే లాభం ఉంటుందా? త‌మిళ‌నాడు డీఎంకే పెద్ద మ‌నిషి.. దివంగ‌త క‌రుణ మ‌రో కుమారుడ ఆళ‌గిరి వ్య‌వ‌హారం చూస్తున్నోళ్లంతా ఇప్పుడు తిట్టి పోస్తున్నారు. చెట్టంత తండ్రి ఓ ప‌క్క తిరిగి రాని లోకాల‌కు వెళ్లిన వేళ‌.. తండ్రి క‌ల‌ను నెర‌వేర్చాల్సిన కొడుకుగా.. బుద్ధిగా పార్టీలో ప‌ట్టు ఉన్న స్టాలిన్ కు విధేయుడిగా ఉండిపోతే స‌రిపోయేది.

తండ్రి బ‌తికి ఉన్న‌ప్పుడు పార్టీ నుంచి గెంటించుకున్న ఆళ‌గిరి.. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత సోద‌రుడికి తాను అండ‌గా ఉంటాన‌ని.. ఆయ‌న మాటే త‌న‌ద‌ని.. త‌న పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌న్న మాట చెప్పి ఉంటే డీఎంకేలో ఆయ‌న ఇమేజ్ పెర‌గ‌ట‌మే కాదు.. ప్ర‌జ‌ల్లో కూడా ఆళ‌గిరి మీద ఉన్న అభిప్రాయం కాస్త మారేది.

కానీ.. మొండిత‌నం.. మూర్తీభ‌వించిన మూర్ఖ‌త్వంతో ఉండే ఆళ‌గిరి.. తొలుత సోద‌రుడు స్టాలిన్ కుచెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేసి.. ఫ‌లించ‌క‌పోవ‌టంతో బెదిరింపుల‌కు దిగారు. తండ్రి పోయిన బాధ‌లో ఉన్న స్టాలిన్ ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారే కానీ తొంద‌ర‌ప‌డ‌లేదు. ఆళ‌గిరి ప్ర‌య‌త్నాల‌పై పార్టీలోనే వ్య‌తిరేక‌త వ‌చ్చే వ‌ర‌కూ చూసి.. చివ‌ర‌కు త‌న‌కు సోద‌రుడు లేడ‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌ను చేసేశారు.

అదే స‌మ‌యంలో పార్టీలో త‌న‌కు తిరుగులేద‌న్న విష‌యాన్ని చాటి చెప్పాడు. స్టాలిన్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌.. త‌న‌కు తోడుగా నిలుస్తార‌ని భావించిన వారంతా హ్యాండ్ ఇచ్చిన‌త‌ర్వాత కానీ ఆళ‌గిరి త‌త్త్వం బోధ ప‌డ‌లేదు. అందుకే కాబోలు ఇప్పుడు అహంకారం మ‌త్తు దిగిన ఆయ‌న‌.. స్టాలిన్ తో రాజీ ప్ర‌య‌త్నాల‌ను తెర తీశారు. ఎప్పుడూ లేని విధంగా తాను స్టాలిన్ నాయ‌క‌త్వాన్ని అంగీక‌రిస్తానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

సెప్టెంబ‌రు 5న త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి మౌన ప్ర‌ద‌ర్శ‌న‌తో త‌న బ‌లాన్ని చాటి చెబుతాన‌ని చెప్పిన ఆయ‌న‌.. తాజాగా ప్లేట్ మార్చేసి చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్సిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆళ‌గిరి.. త‌న‌ను డీఎంకేలో చేర్చుకుంటే స్టాలిన్ నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌టానికి సిద్ధ‌మేన‌ని చెప్ప‌ట‌మే కాదు.. పార్టీలోకి వెళ్లాల‌నుకుంటే స్టాలిన్ నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్థించి తీరాలిగా అంటూ వ్యాఖ్యానించారు. మ‌రి.. ఈ సంచ‌ల‌న వ్యాఖ్య నేప‌థ్యంలో బంతి స్టాలిన్ కోర్టులోకి వ‌చ్చి చేరింది. మ‌రిప్పుడు ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే.. ఆళ‌గిరి ప్ర‌క‌ట‌న‌పై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.