Begin typing your search above and press return to search.

ర‌విప్ర‌కాశ్ కు అలంద మీడియా భారీ కౌంట‌ర్ వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   23 May 2019 3:55 AM GMT
ర‌విప్ర‌కాశ్ కు అలంద మీడియా భారీ కౌంట‌ర్ వ్యాఖ్య‌లు!
X
టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ విడుద‌ల చేసిన ఏడు నిమిషాల వీడియోపై టీవీ9 కొత్త యాజ‌మాన్యం (అలంతా మీడియా అండ్ ఎంట‌ర్ టైన్ మెంట్) స్పందించింది. ఇప్ప‌టివ‌ర‌కూ ర‌విప్ర‌కాశ్ చేసిన ప‌లు విమ‌ర్శ‌ల‌కు ఎప్పుడూ నోరు విప్ప‌ని స‌ద‌రు సంస్థ తాజాగా త‌న వాద‌న‌ను వినిపించింది. వీడియోలో ర‌విప్ర‌కాశ్ ప్ర‌స్తావించిన ప్ర‌తి అంశంపైనా కొత్త మేనేజ్ మెంట్ ప‌వ‌ర్ ఫుల్ రిప్లై ఇచ్చింది.

ర‌విప్ర‌కాశ్ మాట‌ల్నే ప్ర‌శ్న‌లుగా చేసుకొని.. ర‌విప్ర‌కాశ్ చేస్తున్న‌దంతా అస‌త్య ప్ర‌చార‌మ‌ని.. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు.. చెబుతున్న నీతుల‌కు ఏ మాత్రం పొంత‌న లేదంటూ క్లియ‌ర్ క‌ట్ కౌంట‌ర్ ను విడుద‌ల చేసింది. స‌ద‌రు కౌంట‌ర్ సుదీర్ఘంగా ఉన్న‌ప్ప‌టికి ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మొత్తం జ‌రిగిన ఎపిసోడ్.. ర‌విప్ర‌కాశ్ వినిపిస్తున్న వాద‌న మాత్ర‌మే ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు వ‌చ్చింది కానీ.. కొత్త మేనేజ్ మెంట్ ఏం అనుకుంటోంది? ర‌విప్ర‌కాశ్ చేస్తున్న ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌ల‌పై త‌న వాద‌న ఏమిట‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేని ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. అలంద మీడియా ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. కొత్త చ‌ర్చ‌కు తెర తీసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అలంద మీడియా సంస్థ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న య‌థాత‌ధంగా చూస్తే..

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-1

శ్రీనిరాజుగారు లాభాలతో బయటకు వెళ్లదల్చుకున్నారు. ఆయన్నులాభాలతో బయటకు వెళ్లనివ్వండి అని చెప్పి, నేను ఒక్క రూపాయి లాభం ఆశించకుండా - ఒక్క రూపాయి ప్రయోజనం ఆశించకుండా టీవీ9 ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఈ డీల్ ను చేయాలని సంకల్పించాను.

అసలు నిజం

టీవీ9 యాజమాన్యం బదిలీ జరగడానికి ముందు - బదిలీ జరిగిన తర్వాత - నువ్వు - నీ చుట్టూ ఉన్న మరో ఇద్దరు ముగ్గురు టీవీ9 సంస్థ నుంచి జీతం కాకుండా - వివిధ రూపాల్లో పొందిన ఆర్థిక ప్రయోజనం ఎంతో ఒక్కసారి లెక్కవేసుకో. టీవీ9 కంటే మించి లాభాల్లో ఉండే ఎన్ని కంపెనీల్లో ఒక సీఈవోకి ఇంత ప్రతిఫలం దక్కిందో నీ అంతరాత్మను ఒక్కసారి అడుగు. నీ బ్యాంక్ అకౌంట్‌ ని ఒక్కసారి చూసుకో. నిజం నీకళ్లు తెరిపిస్తుంది.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-2

తన స్నేహితులతో కలిసి - ఆయన పెట్టుబడి తో టీవీ9 సంస్థలోకి వస్తారని నేను ఆశించాను. కానీ నేను ఆశించింది ఒకటి - జరిగిందొకటి. పారిశ్రామిక వేత్త స్థానంలో మెజార్టీ వాటాదారుడిగా రామేశ్వరరావు టీవీ9 సంస్థ అయిన ABCL లోకి వచ్చి చేరారు.

అసలు నిజం

రామేశ్వరరావు టీవీ9 సంస్థలో ప్రధాన వాటాదారనే విషయం ఒప్పందానికి ముందు నిజంగా నీకు తెలియకపోతే, ఆ ఒప్పందంపై సంతకం ఎలా చేశావు? ఎందుకు చేశావు? కొత్త యాజమాన్యం వచ్చిన తర్వాత టీవీ9 సంస్థలో కొత్త వాటాదార్ల వివరాలన్నింటినీ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కు ఎందుకు పంపించావు? ఎలా పంపించావు?

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-3

మనిద్దరి మధ్యలో ఒక షేర్ హోల్డర్ అగ్రిమెంట్ అనేది చట్టరీత్యా అవసరం. చట్టంచెబుతోంది - ఒక మెజార్టీ షేర్ హోల్డర్ వచ్చి - ఒకమైనార్టీ షేర్ హోల్డర్ ఉన్నకంపెనీలో చేరినప్పుడు ఇద్దరి మధ్యా ఒప్పందం - ఒడంబడిక కచ్చితంగా కావాలి.

అసలు నిజం

కంపెనీల చట్టంలో నిబంధనల ప్రకారం - మెజార్టీ వాటాదార్ల నిర్ణయమే చెల్లుతుంది. కంపెనీల చట్టం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా... ఈ విషయం నీకు తెలిసి ఉండేది. నువ్వు కోరుకునే షేర్ హోల్డర్ల ఒప్పందం అంటే... 90 శాతం వాటా దారులు కంపెనీ మొత్తాన్ని నీ ఇష్టారాజ్యానికి వదిలేసి - నీకు అన్ని విషయాల్లోనూ వీటో పవర్ ఇవ్వడమా.. ? ఇలాంటి షేర్ హోల్డర్ల ఒప్పందాన్ని ఎక్కడైనా చూశావా..?

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-4

రవిప్రకాశ్-శివాజీ ఒక ప్రైవేటు ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రైవేటు ఒప్పందానికి సంబంధించి రామేశ్వరరావు బంధువు వచ్చి ఒక కేసు పెడతారు.

అసలు నిజం

సదరు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి టీవీ9 సంస్థలో డైరెక్టర్. అదే విషయాన్ని కొన్ని నెలల ముందు స్వయంగా నువ్వే ఎంఐబీకి తెలియజేశావు. కాస్త గుర్తు తెచ్చుకో. పాత తేదీలతో ఫోర్జరీ ఒప్పందాలు కుదుర్చుకుని - కొత్త యాజమాన్యానికి అడ్డంకులు కల్పిస్తుంటే, ఆ యాజమాన్య సంస్థ తరపున, ఆ సంస్థ డైరెక్టర్ హోదాలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్పా.. ? ఇదే తప్పయితే, ఆధారాలతో సహా పట్టుబడ్డ నీ అడ్డగోలు ఫోర్జరీలను ఏమనాలి? దబాయించడంలో ఆరితేరిపోయిన నీకు - చట్టప్రకారం చేసేవన్నీ అడ్డగోలుగానే కనిపిస్తుంటాయి కాబోలు. పోలీసుల ముందుకు వెళ్లి ఆ ఆధారాలన్నింటినీ ఒక్కసారి చూసుకుంటే - నిజం ఏంటో నీకే తెలుస్తుంది.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-5

రవిప్రకాశ్ దగ్గర పనిచేస్తున్న ఒకపార్ట్ టైమ్ ఎంప్లాయ్ దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని - రవిప్రకాశ్ ఫోర్జరీ చేసి - అతని రాజీనామాలేఖను అప్ లోడ్ చేశారని.

అసలు నిజం

రవిప్రకాశ్ - దేవేందర్ అగర్వాల్ అనే వ్యక్తి టీవీ9 సంస్థలో కంపెనీ సెక్రటరీ హోదాలో - కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం నియమితమైన పూర్తి స్థాయి ఉద్యోగి. ఆ విషయాన్ని కాస్త తెలుసుకో. కంపెనీల చట్టంలో ఈ ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో కాస్త తెలుసుకునే ప్రయత్నం చేయి.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-6

దేవేందర్ అగర్వాల్ సిగ్నేచర్‌ ను రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారన్న ఒక తప్పుడు క్రిమినల్ కేసును పెట్టే ప్రయత్నం చేశారు.

అసలు నిజం

ఈ విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీనే స్వయంగా అదే రోజు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. తాను రాజీనామా చేయకున్నా - రాజీనామా చేసినట్లు - తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సదరు కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అబద్ధాలు మూటగట్టడంలో బిజీబిజీగా ఉన్న నువ్వు కాస్త ఈ నిజాన్ని గుర్తు తెచ్చుకో.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-7

టీవీ9 లోగో ఆథర్ ఈజ్ రవిప్రకాశ్. టీవీ9 లోగోను సృష్టించింది రవిప్రకాశ్. టీవీ9 లోగో యజమాని రవిప్రకాశ్.

అసలు నిజం

నాయినా రవిప్రకాశ్.. టీవీ9 లోగోను సృష్టించింది నేనేనని చెప్పుకుంటున్న నువ్వు... ఇందుకు సంబంధించి కాపీరైట్ చట్టంలోని నిబంధనలను కాస్త చదువుకో. ఈ చట్టం ప్రకారం లోగోను డిజైన్ చేసిన - లేదా చేయించిన వ్యక్తి ఆథర్ అవుతారు. అన్నిరకాల కాపీరైట్స్ కు ఇదే నిబంధన వర్తిస్తుంది. ఒక ఉద్యోగిగా కంపెనీ జీతం తీసుకుని నువ్వు చేసింది ఇదే. తరువాత అదే లోగోను - కంపెనీ పేరు మీద అసైన్ చేస్తూ ట్రేడ్‌ మార్క్‌ - కాపీరైట్‌ సంస్థల అధికారులకు ఎన్నో ఏళ్లక్రితం నీ అంతట నీవే అన్ని పత్రాలను సమర్పించావు. ఏ కాపీరైట్ విషయంలోనైనా జరిగేది ఇదే పద్ధతి. టీవీ9 లోగోలు మొదట్నుంచీ కూడా ABCL పేరుమీదే ఉన్నాయి తప్ప - రవిప్రకాశ్ అన్న పేరు మీద లేవన్న విషయాన్ని కాస్త గుర్తు తెచ్చుకో. ఇన్నేళ్లూలేని కాపీరైట్ యాజమాన్య హక్కు ఇప్పుడెందుకు నీకు గుర్తుకొచ్చింది నాయినా.. వందల కోట్లు ఖర్చుపెట్టి 2018 ఆగస్టులో నీ కంపెనీలో 90 శాతానికి పైగా వాటాను కొత్త యాజమాన్యం కొనుగోలు చేస్తే, ఆ ఒప్పందంపై సంతకం చేసిన నువ్వు... ఇది జరిగిన తర్వాత నాలుగు నెలలకు, అంటే డిసెంబర్ 31 - 2018న - దొంగచాటుగా టీవీ9 లోగోల కాపీరైట్‌ ను వేరేవారికి బదలాయించే ప్రయత్నం చేయడం, నువ్వు నమ్మే విలువల్లో భాగమా.. ?NCLTలో పిటిషన్‌ ను అడ్డు పెట్టుకుని... ఇద్దరు వ్యక్తుల మధ్య 40 వేల షేర్ల మార్పిడి కుదరదంటూ నానా హంగామా సృష్టించిన నువ్వు, ఏకంగా కంపెనీకి బ్రాండ్ అయిన టీవీ9 లోగోలను కేవలం రూ.99 వేలకు అమ్మే ప్రయత్నం చేయడం నీకున్న అతి తెలివితేటలకు నిదర్శనం కాదా?

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-8

ఈరోజు - నా ముందున్న ప్రధానమైన సమస్య - నేను విలువల్ని పాటించాలా - ఈ రోజు దాకా ఏ విలువల గురించైతే మాట్లాడానో - ఏ జర్నలిజం గురించైతే మాట్లాడానో - ఏ సమాజహితం గురించైతే మాట్లాడానో - ఆ విలువల కోసం నేను పనిచేయాలా...

అసలు నిజం

నాయినా... రవిప్రకాశ్ - విలువల గురించి నువ్వు మాట్లాడుతుంటే... దొంగే దొంగని అరిచినట్లుగా అందరికీ అనిపిస్తోంది. ఈ విషయం గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. జర్నలిస్టునని చెప్పుకుంటూ, సంస్థను అడ్డుపెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలు - సాగించిన అక్రమాలు వేలల్లో ఉన్నాయి. ఆ బాధితులందరూ నీ ముందుకు వస్తే - నీ విలువలేంటో నీకు తెలిసొస్తుంది.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-9

కొంత మంది ధనిక స్వాముల బలానికి భయపడి వారికి - వారి దొంగ కేసులకు భయపడి - నేను పూర్తిగా వారికి ఊడిగం చేస్తుండాలా?

అసలు నిజం

నాయినా.. రవిప్రకాశ్ - టీవీ9లో చేరకముందు నీ జీతం ఎంత - నీ ఆస్తులు ఎంత - చేరాక నీ జీతం ఎంత - నీ ఆస్తులు ఎంత.. విదేశాల్లో నీకున్న వ్యాపారాలేంటో, ఒక్కసారి లెక్కలు వేసుకుని చూస్తే - నువ్వు ధనిక స్వామివో - సగటు జర్నలిస్టువో ఇట్టే తెలిసిపోతుంది.ఇలాంటి తెలివితక్కువ వాదనలు ముందుకు తెచ్చినంత మాత్రన నీ నిజస్వరూపం ఎవరికీ తెలియదని భ్రమపడకు.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-10

నేను అనుకునేది - భవిష్యత్ తరాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే - భవిష్యత్తరాలు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే - భవిష్యత్తరాలు మనల్ని తల ఎత్తి చూడాలంటే - జీవితంలో విలువలు తప్పనిసరి.

అసలు నిజం

సమాజం పట్ల నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దు. వినడానికి కూడా సిగ్గేస్తోంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడం లేదనుకుంటున్నట్లుగా ఉంది నీ వ్యవహార శైలి.

“వంద కళేబరాలను తిన్న రాబందు.. ఒక్క గాలివానకు గల్లంతైనట్లు” అనే సామెత నీకు బాగానే తెలిసి ఉంటుందనుకుంటా... బహుశా - నీ విషయంలో ఇది బాగా వర్తిస్తుందేమో... ఇకనైనా గాలి కబుర్లు మాని - చట్ట ప్రకారం వ్యవహరించు నాయినా..!