Begin typing your search above and press return to search.

ఆ సీటుపై టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   23 Dec 2022 5:10 AM GMT
ఆ సీటుపై టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీలో తెనాలి నియోజకవర్గం చర్చకు దారితీస్తోంది. టీడీపీ–జనసేన పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆలపాటి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెనాలి సీటు తనకేమీ రాసిపెట్టలేదని అన్నారు. గతంలో తాను వేమూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగానూ పనిచేశానని రాజా గుర్తు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయాలంటే అక్కడ నుంచి పోటీ చేస్తానన్నారు. పొత్తుల వ్యవహారం, తన భవిష్యత్తు చంద్రబాబు చూసుకుంటారని ఆలపాటి రాజా స్పష్టం చేశారు. తన గురించి ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడ నుంచి తాను పోటీ చేయాలనే ప్రత్యామ్నాయాలను పార్టీ అధినేత చంద్రబాబు సూచిస్తారని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో టీడీపీ–జనసేన పొత్తు ఖాయమని ఆలపాటి రాజా చెప్పినట్టేనని అంటున్నారు. అలాగే తెనాలి సీటు కూడా జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ కేనని స్పష్టం చేసినట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీకి చెందిన అన్నాబత్తుని శివకుమార్‌ ఉన్నారు. ఏఎస్‌ఎన్‌ విద్యా సంస్థల అధినేతగా ఉన్న శివకుమార్‌ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. ఇక టీడీపీ తరఫున ఇక్కడ 2014 ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (రాజా) గెలుపొందారు.

1994, 1999ల్లో వేమూరు నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు.. ఆలపాటి రాజా. అయితే 2004లో ఆలపాటి ఓడిపోయారు. ఇక 2009లో వేమూరు ఎస్సీ రిజర్వుడ్‌గా మారడంతో ఆలపాటి తెనాలి నుంచి పోటీ చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడు, ప్రస్తుతం జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా 2014 ఎన్నికల్లో ఆలపాటి రాజా టీడీపీ తరఫున తెనాలి నుంచి గెలుపొందారు. ఇక 2019లో అన్నాబత్తుని శివకుమార్‌ వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి రాజాపై గెలుపొందారు.

అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన పొత్తు కుదిరే పక్షంలో తెనాలి సీటును జనసేనకు వదిలేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో పవన్‌ కల్యాణ్‌ తర్వాత స్థానంలో నెంబర్‌ టూగా ఉన్నారు. అంతేకాకుండా గతంలో రెండు పర్యాయాలు 2004, 2009ల్లో నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెనాలి నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెనాలి సీటును జనసేన పార్టీకి వదిలేయాల్సి ఉంటుంది. కాగా తెనాలి నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు, కాపు ఓటర్లు సమానంగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఈ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఘన విజయం ఖాయం.

ఒకవేళ తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తే.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, గతంలో సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు సీటు హుళక్కే.

జనసేన పార్టీకి సీటు కేటాయిస్తే ఆలపాటి రాజా ఎమ్మెల్సీగా అవకాశమివ్వవచ్చని చెబుతున్నారు. లేదా గుంటూరు నుంచి ఎంపీ పదవికి పోటీ చేయించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.