Begin typing your search above and press return to search.

అంపైర్ కుర్చీకేసి రాకెట్ ను బాదేసిన టాప్ ఆటగాడు.. టోర్నీ నుంచి గెంటేశారు

By:  Tupaki Desk   |   24 Feb 2022 4:30 AM GMT
అంపైర్ కుర్చీకేసి రాకెట్ ను బాదేసిన టాప్ ఆటగాడు.. టోర్నీ నుంచి గెంటేశారు
X
సహనాన్ని అసహనం డామినేట్ చేసింది. అవసరానికి మించిన అసహకాన్ని ప్రదర్శించిన అగ్రశ్రేణి ఆటగాడి తీరు విస్తుపోయేలా చేసింది. పేరుకు టాప్ ఆటగాడిగా ఉన్న సదరు క్రీడాకారుడు.. తనకు ఏ మాత్రం తగ్గని తీరును ప్రదర్శించి అవమానకర రీతిలో టోర్నీ నుంచి వైదొలిగిన అరుదైన ఉదంతం. ప్రపంచ మూడో ర్యాంకర్.. జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ ను తాజాగా మెక్సికో ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి గెంటేశారు. దీనికి కారణం.. ఆట మధ్యలో అతను ప్రదర్శించిన అసహనమే.

ప్రస్తుతం జరుగుతున్న మెక్సికో ఓపెన్ టెన్నిస్ టోర్నీలో డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో జ్వెరెవ్ - మార్సెలో మెలో (బ్రెజిల్) జోడీ 2-6, 6-4, 6-10 తో గ్లాస్ పూల్ - హారి హెలియోవారా జంట ఓటమిపాలైంది. మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై జ్వెరెవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడితో ఆగని అతడు హద్దులు మీరిన అగ్రహాన్ని ప్రదర్శించి అనూహ్యంగా వ్యవహరించారు.

తన రాకెట్ తో అంపైర్ కుర్చీకేసి బలంగా బాదారు. ఆ సమయంలో అంపైర్ వెంటనే స్పందించి.. తన కాళ్లను వెనక్కి తీసుకోవటంతో సరిపోయింది కానీ.. లేని పక్షంలో ఆయన కాళ్లకు బలమైన గాయం అయ్యేదని చెబుతున్నారు. ఒక విధంగా అంపైర్ ను కొట్టినంత పని చేశారు. ఈ తీరును టోర్నీ నిర్వాహకులు సీరియస్ గా తీసుకున్నారు. క్రమశిక్షణ తప్పించిన జ్వెరెవ్ ను టోర్నీ నుంచి తప్పించినట్లుగా పేర్కొన్నారు.

చేయాల్సిన ఎదవ పని చేసిన జ్వెరెవ్.. తాను చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. చైర్ అంపైర్ తో పాటు టోర్నీ నిర్వాహకులకు సారీ చెప్పాడు. ఇదంతా చేసే బదులు.. నియంత్రణతో వ్యవహరించి ఉండి ఉంటే.. విషయం ఇంత దూరం వెళ్లేదే కాదు కదా?