Begin typing your search above and press return to search.

అలీ ఏం ఆశించారు? జగన్ ఏం చేశారు?

By:  Tupaki Desk   |   18 March 2019 5:20 PM GMT
అలీ ఏం ఆశించారు? జగన్ ఏం చేశారు?
X
ప్రత్యక్ష రాజకీయాలపై తీవ్రమైన ఆసక్తితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఉబలాటపడ్డాడు నటుడు అలీ. తను మంత్రి కావాలనుకుంటున్నట్టుగా ఆయన బాహాటంగానే ప్రకటించుకున్నారు కూడా. అందుకోసమే ఏ పార్టీ తరఫున అయినా పోటీకి రెడీ అనే సంకేతాలు ఇచ్చారు.

ముందుగా జగన్ ను కలిశారు.ఆ వెంటనే అలర్ట్ అయిన చంద్రబాబు నాయుడు.. అలీని పిలిపించుకుని మాట్లాడారు. దీంతో అలీకి తెలుగుదేశం టికెట్ ఖరారు అయ్యిందని ప్రచారం జరిగింది. గుంటూరు నుంచి ఒక సీటు నుంచి అలీ పోటీచేయబోతున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. ఆ మేరకు అలీ అక్కడ ఓటుకూడా నమోదు చేయించుకున్నారు.

ఆ పై మళ్లీ కథలో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు అలీకి అవకాశం ఇవ్వడం లేదని స్పష్టం అయ్యింది.దీంతో లేటు చేయకుండా జగన్ ను వెళ్లి కలిశాడు ఈ కమేడియన్. జగన్ ను కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నాడు. ఆ సమయంలో అలీ మాట్లాడుతూ.. తనకు జగన్ హామీ ఇచ్చాడని, తనకు ఆయన భరోసాను ఇచ్చాడని.. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి రెడీ అని ప్రకటించాడు. ఆ రోజు మీడియా ముందు అలీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేనట్టుగా మాట్లాడాడు.

ప్రచారం అన్నాడు. ఆ మేరకు వైసీపీ వాళ్లు అలీ చేత ప్రచారం కూడా మొదలుపెట్టించారు. మైనారిటీ ఆత్మీయ సదస్సుల్లో అలీ కనిపించారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం జాబితా వచ్చేసింది. ఇలాంటి సమయంలో.. అలీ పేరు ఆ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారుతూ ఉంది. అలీకి జగన్ ఝలక్ ఇచ్చాడని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన రోజు అయితే అలీ నుంచి తను ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నట్టుగా ప్రకటించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తొలి జాబితా తర్వాత మాత్రం.. అలీ టికెట్ ఆశించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి అసలు కథ ఏమిటో!