Begin typing your search above and press return to search.

అజ్ఞాతం వీడిన చైనా అపర కుబేరుడు !

By:  Tupaki Desk   |   13 Oct 2021 6:34 AM GMT
అజ్ఞాతం వీడిన చైనా అపర కుబేరుడు !
X
చైనాకి చెందిన బిలియనీర్ అలీబాబా, యాంట్ గ్రూప్‌ల వ్యవస్థాపకుడు జాక్ మా కి చైనా ప్రభుత్వానికి ఏమాత్రం పొసగట్లేదన్న విషయం తెలిసిందే. జాక్ మా కి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గతేడాది యాంట్ గ్రూప్ ఐపీఓని అడ్డుకున్న చైనా ప్రభుత్వం తాజాగా మీడియా సంస్థల్లో అలీబాబా గ్రూప్ కి ఉన్న పెట్టుబడులను కూడా ఉపసంహరించుకోవాలని ఆదేశించిందట. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఆన్ లైన్ రిటైల్ రంగాన్ని ప్రధానంగా చేసుకొని ఎదిగిన అలీబాబా గ్రూప్ మైక్రోబ్లాగింగ్ సంస్థ వీబోలో షేర్లను కలిగి ఉంది. దీనితో పాటు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వంటి కొన్ని ఇతర మీడియా సంస్థల్లోనూ అలీబాబా గ్రూప్ కి పెట్టుబడులు ఉన్నాయట.

ఈ వార్తా సంస్థలు, సోషల్ మీడియా సంస్థల ద్వారా ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేస్తారన్న ఆలోచనతోనే అలీబాబా గ్రూప్‌కి సంబంధించిన పెట్టుబడులన్నింటినీ తిరిగి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తోందని అక్కడి నిపుణులు వెల్లడిస్తున్నారు. చైనాకి చెందిన బిలియనీర్లలో ఒకరైన జాక్ మా సాధారణ స్థాయి నుంచి కుబేరుడిగా ఎదిగారు. ఎన్నో వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమయ్యారు. దీనికి చైనా ప్రభుత్వం కూడా ఆయనకు ఎంతగానో సహకరించింది. కానీ గతేడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైనా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపినందుకు చైనా ప్రభుత్వం జాక్ పై కఠినంగా వ్యవహరిస్తోంది. గతేడాది అక్టోబర్ లో చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల్లా వ్యవహరిస్తున్నాయని జాక్ మా చేసిన విమర్శను అక్కడి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది.

డిసెంబర్ లో అలీబాబా గ్రూప్ పై యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. యాంట్ గ్రూప్ సంస్థలను కూడా టార్గెట్ చేసింది. ఆ సంస్థ ఐపీఓని అడ్డుకుంది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఏడాది తర్వాత మళ్లీ మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. హాంకాంగ్‌లో గత కొన్నిరోజులుగా వ్యాపార సంబంధిత సదస్సుల్లో ప్రసంగిస్తున్న ఆయన.. బయట మాత్రం మీడియాతో ఏం మాట్లాడకుండానే వెళ్లిపోవడం గమనార్హం. జాక్‌ మా వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు ఎదురవ్వడంతో పాటు యాంట్‌ గ్రూప్‌కు సంబంధించి ఏకంగా 37 బిలియన్‌ డాలర్ల ఐపీవోకు బ్రేకులు పడ్డాయి.

అడపాదడపా కొన్ని మీటింగ్స్‌లో పాల్గొన్నప్పటికీ.. బయటికి కనిపించింది మాత్రం లేదు. ఈ తరుణంలో మంగళవారం హాంకాంగ్‌ లోని ఓ బిజినెస్‌ వేదిక వద్ద జాక్‌ మా కనిపించడంతో మీడియా ఆయన ముందు మైక్‌ ఉంచింది. అయితే వ్యాపార సంబంధ వ్యవహారాల వల్ల తానేం మాట్లాడబోనని సున్నితంగా తిరస్కరించారు. ఇక చివరిసారిగా అక్టోబర్‌లో ఏషియన్‌ ఫైనాన్షియల్‌ హబ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న జాక్‌ మా.. బహిరంగంగా కనిపించింది లేదు. చైనా ప్రభుత్వంపై చేసిన వ్యతిరేక కామెంట్లు ఆయన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. చైనా ప్రభుత్వ ప్రతీకారంతో ఆర్థికంగా జాక్‌ మాకు కోలుకోలేని దెబ్బలు పడుతున్నాయి. ఈ తరుణంలో చైనా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తిరిగి ప్రయత్నాలు చేస్తున్నాడు. సెప్టెంబర్‌ లో దేశ ఆర్థిక పురోగతికి 15.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చైనా ప్రభుత్వానికి ఆఫర్‌ చేశాడు.

డ్రాగన్‌ ప్రభుత్వ మద్దతుతో ఈమధ్యే రిలీజ్‌ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ది బాటిల్‌ ఎట్‌ లేక్‌ చాన్‌గ్జిన్‌’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు కూడా. దీంతో అలీబాబా షేర్స్‌ కొంతలో కొంత పుంజుకుంటున్నాయి. యాభై ఏడేళ్ల జాక్‌ మా మొత్తం ఆస్తుల విలువ 51.5 బిలియన్‌ డాలర్లు. చైనాలో మూడో ధనికుడిగా ఉన్న జాక్‌ మా, గతంలో ఇంగ్లీష్‌ టీచర్‌ గా పని చేశాడు. తూర్పు చైనా నగరం హాంగ్‌ జౌ కేంద్రంగా మల్టీనేషనల్‌ టెక్నాలజీ కంపెనీ అలీబాబా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హాంకాంగ్‌ తో పాటు న్యూయార్క్‌ లోనూ అలీబాబా కార్యకలాపాలకు గుర్తింపు ఉంది.