Begin typing your search above and press return to search.

మైసూరులో గ్రహాంతరజీవులు?

By:  Tupaki Desk   |   4 May 2016 5:10 AM GMT
మైసూరులో గ్రహాంతరజీవులు?
X
ఈ అనంత విశ్వంలో మనిషి కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అన్న ప్రశ్న ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. మనకు తెలీని గ్రహాల్లో మనుషులు ఉన్నారని.. వారు మనకంటే చాలా అడ్వాన్స్ అన్న వాదనలు వినిపిస్తునే ఉంటాయి. దీనికి బలం చేకూరేలా అప్పుడప్పడు విచిత్రమైన వస్తువులు గాల్లో ఎగరటం లాంటివి జరిగాయని పలువురు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పటం వింటుంటాం. అయితే.. ఇలాంటివి వివిధ దేశాల్లో చోటు చేసుకుంటుంటాయి. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా మన దేశంలోనే అది కూడా మన పొరుగునే ఉన్న కర్ణాటకలో చోటు చేసుకుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లా పిరాయపట్టణ తాలూకాలో ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) కనిపించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించిన ప్రచారం ఇప్పుడక్కడ బలంగా జరుగుతోంది. ‘‘సూలకోటె’’ గ్రామానికి చెందిన ఒక రైతు అర్థరాత్రి వేళ తన పొలంలో పంటకు నీరు పెట్టటానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆకాశంలో నుంచి భారీ వెలుగుతో వచ్చిన ఓ వాహనం అక్కడ భూమిని ఢీ కొట్టి వెళ్లినట్లుగా చెబుతున్నాడు.

సదరు రైతు మాటతో మైసూర్ జిల్లాలోకి గ్రహాంతరవాసులు వచ్చి వెళ్లినట్లుగా ప్రచారం సాగుతోంది. దీని తీవ్రత పెరగటంతో అధికారులు సైతం ఈ ఉదంతానికి సంబంధించి నిజానిజాలు తెలుసుకునే పనిలో పడ్డారు. నిజంగానే గ్రహాంతరవాసులు వచ్చారా? వస్తే.. క్షణాల్లో భూమిని ఢీ కొట్టి ఎందుకు వెళ్లినట్లు..? భూమిని ఢీ కొట్టిన తర్వాత కూడా వారి వాహనానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి.