Begin typing your search above and press return to search.

30 ఏళ్లలో మనతో గ్రహాంతరవాసులు

By:  Tupaki Desk   |   19 Sep 2015 5:53 AM GMT
30 ఏళ్లలో మనతో గ్రహాంతరవాసులు
X
గ్రహాంతరవాసులు... ఉన్నారో లేరో తెలియని ఈ జీవులపై ఎన్నో కథలు.. మరెన్నో ఊహాగానాలు.. ఇంకెన్నో భయాలు... వారిపై సినిమాలు, సీరియళ్లు.. ఒకటారెండా ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతరజీవులపై అంతులేని ఆసక్తి. మేం గ్రహాంతరవాసులను చూశాం అంటారు కొందరు... ఎగిరేపళ్లాల్లో వచ్చారని కథనాలు - పుకార్లు... అసలు భూమి మీద తప్ప ఇంకెక్కడా జీవం ఉండే ఛాన్సే లేదంటూ కొట్టిపారేస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇలాంటి తరుణంలో నాసా చేసిన ఓ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

కాలిఫోర్నియాలోని సేటి ఇనిస్టిట్యూట్ లో గ్రహాంతరవాసులు, అంతరిక్షంలో జీవంపై పరిశోధనలు చేస్తున్న బృందానికి నాయకత్వం వహిస్తున్న నథాలీ కాబ్రోల్ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రహాంతర వాసులు ఉన్నారని... అయితే.. ఇతర గ్రహాల నుంచి వచ్చే సిగ్నళ్లను పట్టుకోలేకపోవడం వల్లే వారిని గుర్తించలేకపోతున్నామని అంటున్నారు. గ్రహాంతర జీవులను చేరడానికి మనం ఎంతో దూరంలో లేమని... త్వరలో అది సాధ్యమవుతుందన్న విశ్వాసాన్ని ఆమె కనబరుస్తున్నారు. ఈ ఏడాది 10 రకాల రేడియో సిగ్నళ్లను అంతరిక్షం నుంచి శాస్త్రవేత్తలు గుర్తించారట... అవి భూమికి వందకోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.

మరోవైపు నాసా కూడా గ్రహాంతర జీవుల ఉనికిపై సానుకూల వ్యాఖ్యలు చేస్తోంది. వచ్చే 20 నుంచి 30 సంవత్సరాల్లో గ్రహాంతర వాసులను కనిపెడతామని నాసా చీఫ్ సైంటిస్టు స్టీఫెన్ ఎల్లెన్ చెబుతున్నారు.