Begin typing your search above and press return to search.

భూమి మీద ఏలియన్స్ ప్రపంచం.. ఎక్కడంటే..?

By:  Tupaki Desk   |   20 Jun 2022 11:30 PM GMT
భూమి మీద ఏలియన్స్ ప్రపంచం.. ఎక్కడంటే..?
X
ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా..? ఇది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. దీనికి సమాధానంగా గ్రహాంతర జీవుల మనుగడ పై శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. గ్రహాంతరవాసుల సంగతేమో కానీ.. గ్రహాంతరవాసుల ప్రపంచం మాదిరి ఓ ప్రాంతం మన భూమ్మీదే ఉంది. అదెక్కడంటారా.. దక్షిణాఫ్రికాకు ఈశాన్యంలో యెమెన్లో ఉన్న ఓ ప్రత్యేకమైన ద్వీపంలో. ఈ ద్వీపం చాలా అద్భుతంగా.. ఎంతో అందంగా ఉంటుంది.

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ప్రత్యేకమైన ప్రదేశాలున్నాయి. వాటిలో కొన్ని అందంగా ఉండి ఆకర్షిస్తే.. మరికొన్ని ఆసక్తిగా ఉండి దాని గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీని పెంచుతాయి. అయితే యెమెన్లో ఉన్న ఓ ద్వీపం మాత్రం అటు అందంగా ఉండటమే కాదు.. దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తిని కలుగజేస్తుంది. అంతేకాదు.. లైఫ్లో ఒక్కసారైనా ఆ ప్రాంతాన్ని చూసేయాల్సిందేనన్న ఆశ కలిగిస్తుంది. ఆ దీవి సంగతేంటో తెలుసుకుందామా..?

దక్షిణాఫ్రికాకు ఈశాన్యంలో హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపం విచిత్రాల‌కు నిల‌యం. ఇది భూమిపై గ్రహాంతర ప్రపంచం లాంటిది. ఈ ద్వీపం పేరు సోకోట్రా ద్వీపం. ఇది చూసిన వారు మరో ప్రపంచానికి చేరుకున్నట్లు భావిస్తారు. ఇప్పుడిది పర్యాటకులకు కేంద్రంగా మారింది. అరేబియా సముద్రం, గార్దాఫుయ్ ఛానల్ మధ్య ఉన్న ఈ ద్వీపంలో ఉన్న చెట్లు, మొక్కలను చూస్తుంటే అదో కల్పిత ప్రపంచం లా అనిపిస్తుంది. అంత అందమైన ప్రపంచం భూమి మీద ఉందంటే నమ్మలేక పోతారు.

ఈ ద్వీపంలో దాదాపు 800 అరుదైన జాతుల మొక్కలు ఉన్నాయి. అనేక జాతుల జీవుల‌తో పాటు ఎడారులు, పచ్చని మైదానాలు, బంజరు భూమి, సముద్రపు అలలు ఇలా ప్రపంచంలోని అన్ని రంగులు, అన్ని హొయలూ కనిపిస్తాయి. సోకోట్రా ద్వీపం 3796 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని పొడవు 132 కిలోమీటర్లు. వెడల్పు 50 కిలోమీటర్లు. ఇక్కడ ఉన్న అతిపెద్ద పర్వతం మషానిగ్. ఇది 4931 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ద్వీపానికి రాజధాని హడిబు.

ఈ ద్వీపానికున్న‌ ప్రత్యేకత‌ కారణంగా.. 2008 సంవత్సరంలో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంప‌ద‌గా ప్రకటించింది. ఈ ప్రదేశంలో సోకోత్రి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ రెండు చిన్న రాతి ద్వీపాలు కూడా ఉన్నాయి.

పక్షుల గూళ్లు కూడా క‌నిపిస్తాయి. తీర మైదానాలు, సున్నపురాయి పీఠభూమి, హజీర్ పర్వతాలు ఈ ద్వీపంలో కనిపిస్తాయి. ఇక్కడ ఎప్పుడూ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 25° సెంటీగ్రేడ్‌. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో వర్షపాతం ఉంటుంది. రుతుపవనాలు ఈశాన్యం నుంచి ఇక్కడికి చేరుకుంటాయి.